
స్వదేశం స్వంత వాళ్లు నాకు బహుదూరం
నేన్నుది దేశంగాని దేశంలో
డాలర్ల ధనికదేశంలో
IT కంపెనీ టెకీని, నేనొక ప్రవాసిని
అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో
ఆర్థిక మాంద్యం.....
టోర్నడో విలయంలా విరుచుకుపడ్డది
రాత్రికి రాత్రే మిలియన్ డాలర్ల కంపెనీల
Lay off ప్రకటన ......
విస్మయ విద్యుత్ ఘాతం
ఆశలన్నీ ఉరితీయబడ్డాయి ఉన్నఫళంగా
కలలన్నీ కడలి అలల్లా తలక్రిందులై పడ్డాయి
నడి వీధిలో నేను నిలబడ్డాను
Lay off ప్రకటన
అందమైన ఆశయాల వృత్తాన్ని రెండుగా ఖండించిన చాపం
మిలియన్ డాలర్ల కంపెనీల అస్తిత్వపు పాపం
ఈ శీతల దేశంలో
కొండల శిఖరాలు, ఇండ్లపై కప్పులు,
తరువుల నిలువు నిస్తారంగా
రోడ్లు , సమస్త వస్తువులు...
డాలర్ల నా డ్రీమ్ లైఫ్ విస్తారంగాకురుస్తున్న
మంచుతో గడ్డకట్టుకపోయాయి
మనసులో ప్రశ్నల మంచువాన ఆగకుండా కురుస్తోంది
అంతా తెల్లని హిమపాతం
మనిషి ఉనికిని ప్రశ్నార్థకంచేసే దయలేని దట్టమైన మంచు
ఇది ఆర్థికమాంద్యం మంచు
మృత్యలోయ ఆఖరి అంచు
ఆశలను,శ్వాసలను శాశ్వతంగా ముంచు
ఆదిత్యుణ్ణి కప్పిన మబ్బుల ఆకాశపు మంచు
గుండె నుండి రక్తంతో పాటే శరీరమంతా నిరుత్సాహం
ఈ దేశంలో క్రొత్తగా
lay off టెకీల కన్నీటి నదులు పారుతున్నాయి
నిద్రపట్టదు, నిరాశలో ఏమీతట్టదు
ఏటూ పాలుపోనీ ఈ వింత అయోమయంలో
అంతస్సంఘర్షణల ఒంటరి హృదయం నాది
ఈ మంచును తొలగించటం జీవించటమంత అవసరం
ఈ కాయానికి వెచ్చని దుస్తువులు వేసుకోక తప్పదు
ఈ గాయానికి మందు రాసుకోక తప్పదు
క్రొత్త దారిలో నడవాలి నేను
టెకీలకు ఆదర్శంగా నిలవాలి నేను
ధైర్యం చమురుపోసి ఆత్మవిశ్వాస వత్తి వేసి
ఈ రాత్రి దీపం వెలిగిస్తాను
ఈ రాక్షస మంచుకరిగే
రేపటి సూర్యోదయం కోసం
నేను నిరీక్షిస్తున్నాను ఆశగా
ఇప్పుడు పాత జ్ఞాపకాలు కూడా చల్లగానే తగులుతున్నాయి
నా దేశం ఫుట్ పాత్ మీద
లెమ్మనరన్న నమ్మకంతో అక్కడో ఆకారం ఉండేది
ఇక్కడ వెచ్చని సత్యం ఏదో ప్రకటన చేస్తూ
హృదయాకాశంలో సంచరిస్తున్నది.