ఓట్లను నోట్లు కమ్మేసి మత్తులో ముంచేసే కాలంలో 'ప్రజలు గెలవాలి ' అంటూ నిజామాబాద్ నుండి ఘణపురం దేవేందర్ రాసిన కవిత ఇక్కడ చదవండి :
ఓట్ల సమయం వచ్చింది
వాగ్దానాల గేట్లు తెరుచుకున్నాయి
అబద్ధాలు అందంగా చెక్కబడి
ప్రదర్శనలో పెట్టబడ్డాయి
ఓటర్ లోని ఆశను ఆకర్షించేందుకు
ఉచిత అయస్కాంతాలు కసరత్తు చేస్తున్నాయి
ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు
ఉద్వేగాల వలలు పరుచబడ్డాయి
ఎన్నికలంటే ఒకరి క్షేమం కాదు
జాతి క్షేమం
ఇప్పుడు
మచ్చలేని నాయకులు మచ్చుకైనా దొరకరు
తరతరాల కోసం ఆస్తులు సంపాదించుకునేవాళ్లు తప్ప
ముందుతరం కోసం పనిచేసే నాయకులు అరుదైన కాలం
ఆత్మాభిమానాలు ఆత్మహత్య చేసుకునే కాలం
ఆత్మవిశ్వాసాల అడ్రస్ గల్లంతయై
పౌరుషాల కోరలు పీకేసే కాలం
విద్వేష వ్యూహాలకు పదును పెట్టి
నది లాంటి భాషను వదిలి
మురికి కాలువ లాంటి
తిట్లజలంలో జలకాలాడే కాలం
ఓట్లను నోట్లు కమ్మేసి మత్తులో ముంచేసే కాలం
ఓటర్లను ఒకవైపు నుంచి మతం
మరో వైపు కులం కుళ్ళబొడిచే కాలం
undefined
ఓట్లను అనుచిత ఉచితాలు కొల్లగొట్టే కాలం
ఓట్లను సర్వేలు మాయ చేసే కాలం
ఓటరు సింహాన్ని
చైతన్యం ముసుగు కప్పుకున్న
సోషల్ మీడియా నక్కలు వంచించే కాలం
అకారణ శత్రువులు బుసలు కొట్టేందుకు అనువైన కాలం
ఏమరిస్తే అస్తిత్వ పడవకు చిల్లులు పడే కాలం
ఓటు బ్రహ్మాస్త్రం సంధించేవాడు
లోక కళ్యాణం కోరాలి
పయోముఖ విష కుంభాల ముందు
అర్జునుడి కన్నా ఒక ఆకు ఎక్కువ చదువుకుని విజృంభించాలి
చివరికి ప్రజలు గెలవాలి
ప్రగతి పతాక ఎగరాలి
ప్రజాస్వామ్యం మురవాలి