హృదయాలను రంజింపజేసే మైమ్

By telugu teamFirst Published Jul 20, 2020, 5:06 PM IST
Highlights

వరంగల్ ఎందరో గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిన నేల.  డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారు తమ స్వరంలో ఎన్నో ధ్వనులను అనుకరించి విశ్వవిఖ్యాతిగాంచారు. 

మనిషి నిత్యజీవిత సమరం చేస్తూ చేస్తూ అలసి నీరసపడినప్పుడు , మనసును రంజింపజేసి నూతనోత్తేజాన్ని కలిగించేవే కళలు.  కళలు అరవైనాలుగు.  ఒక్కో కళ ఒక్కో విశిష్టతను కలిగి ఉండి మనల్ని సరికొత్తగా చూపిస్తుంది.  కొన్ని కళలు పుట్టుకతో వస్తే మరికొన్ని అభ్యాసంతో వస్తాయి.  అలాంటి ఓ అబ్బురపరిచే కళలో అంతర్జాతీయఖ్యాతిని సంపాదించిన వరంగల్లు ముద్దుబిడ్డ మైమ్ కళాధర్ ‌. వారిచే రచించబడిన మూకాభినయం mime పుస్తకాన్ని పరిచయం చెస్తున్నాను.

వరంగల్ ఎందరో గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిన నేల.  డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారు తమ స్వరంలో ఎన్నో ధ్వనులను అనుకరించి విశ్వవిఖ్యాతిగాంచారు.  ఇంకా ఎందరో మహానుభావులు ఈ గడ్డన జన్మించి ధన్యతనొందారు. కళలకు కాణాచి ఓరుగల్లు. ప్రతి గుండెలో ఘల్లున ఘల్లున మ్రోగే సంగీత సాహిత్యనృత్య కళాకారులకు పుట్టిల్లు.

మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నట్లు - ఒక్క మాట మాట్లాడకుండా హావభావాల ఊయలలో మనల్ని అనుభూతుల తీరాలకు తీసుకెళ్ళే చార్లీచాప్లిన్ గారిలా తన అధ్భుత హాస్యనటనతో నవ్వులు పువ్వులు పూయించే మిస్టర్ బీన్ లా నటిస్తూ నవ్విస్తూ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిస్తూ పేరుగాంచారు మైమ్ కళాధర్ గారు. మైమ్ అనగానే కళాధర్ గారి పేరే గుర్తుకువస్తుంది. వారి అనుభవాల,అభ్యాసాల విశేషాలనన్నింటినీ గుదిగుచ్చి ముందుతరాలకి సులువుగా మైమ్ కళ నేర్చుకునేందుకు చక్కటి సిలబస్ ను రూపొందించి పుస్తకంగా మలిచారు వీరు.

Also Read: నిర్మాణాత్మక విమర్శకు పర్యాయపదం "అంతరంగం"

ఈ పుస్తకంలో 12 అధ్యాయాలు ఉన్నవి. 1)మూకాభినయం కథాకమీషు 2)నా అనుభవాలే పాఠాలు 3)రంగస్థల కళలకు పునాది 4)సిలబస్ 5) వ్యాయామాలు 6)ఎలాంటి అంశాలు చేయవచ్చు 7)కళాకారుడికి ఉండవలసిన లక్షణాలు  8)స్త్రీ అలంకరణ 9)సమాజం పట్ల కళాకారుడి భాధ్యత 10)మీరు సాధన చేయాల్సిన అంశాలు 11) లిక్కాబుక్ ఆఫ్ రికార్డు 12)మేకప్ చేయడం ఎలా? అనే అంశాలను చేర్చి సవివరణాత్మకంగా వివరిస్తూ భోధించిన గ్రంథమిది.

కళాధర్ మైమ్ అకాడమీని స్థాపించి ఎందరో కళాకారులను తయారుచేసిన వీరిని అభినందిస్తూ డా.కెవి రమణాచారి గారు - ఇది కూడా పరకాయ ప్రవేశమేనంటూ; డా.బి.వి.పట్టాభిరామ్ గారు - మౌనమాంత్రికుడు కళాధర్ అంటూ ; పలుకుదీ శబ్ధభాష-మౌనానిది నిశ్శబ్ధ భాష అంటూ కేంద్రబాలసాహిత్య అకాడమీ ఆవార్డు గ్రహీత 'మేజిక్ చాప్లిన్' చొక్కాపు సత్యనారాయణ గారు అభివర్ణించారు..

భరతముని నాట్యశాస్త్రం ప్రకారం అభినయం నాలుగు విధాలు . అవి ఆహార్యాభినయం, ఆంగికాభినయం, వాచికాభినయం, సాత్వికాభినయం. ఇందులో వాచికాభినయాన్ని తప్పించి తక్కిన ఆహార్యం,ఆంగికం,సాత్వికంతో అభినయించడాన్నే మూకాభినయం అంటారు.

అభినయము నవరసాలను పండించాలి. చూస్తున్న ప్రేక్షకులకు రసానుభూతిని కలిగించాలి.  అంతగా లీనమైపోయి నటించి ప్రేక్షకులను మరోలోకంలో విహరించజేయడమే మైమ్ భారతీయ సాంప్రదాయనృత్యాలలో అనాదిగి మూకాభినయం ప్రక్రియ ఉంది. కథాకళి,భామాకలాపం,దశావతారాలు,మువ్వగోపాలుడు మొదలగు వాటిల్లోనూ వాచికం కన్నా అభినయమే రక్తి కట్టిస్తుంది. ముకాభినయం రంగస్థల కళలకు పునాది వంటిది.

చతుష్షష్టి కళలలో లలిత కళలు ఐదు.  అవి కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం. ఇవి మనకు నేత్రానందాన్ని శ్రవణానందాన్ని కలిగిస్తాయి.  హృదయాలను రంజింపజేస్తాయి. నృత్యంలోని భాగమే మైమ్ .  తమ అభినయంతో భ్రమింపజేస్తూ, నవ్విస్తూ, ఆలోచింపజేసే కళ ఇది.  ఈ కళాప్రదర్శన ఒక్కరు గాని లేదా బృందంగా కూడా అభినయిస్తుంటారు.  శరీరాన్ని అనేక భంగిమలలో వంచుతూ సాగదీస్తూ చేసేక్లిష్టమైన కళ ఇది.  అందులోనూ స్త్రీ అలంకరణ దృశ్యాలను అభినయించడం. చాలా కష్టతరమైనది.  కాని ప్రేక్షకుల మనసును కట్టిపడేసే నటన కళాకారుడిది.  అంతేగాక కళ ఆనందానికే కాక  సమాజం పట్ల భాధ్యత కలిగి ఉన్నపుడే సార్ధకత పోందుతుంటారు కళాధర్ గారు.  అందుకే కార్గిల్ యుద్ధం, సైనికుని జీవితము,మధ్యపాన నిషేదము,స్త్రీ సంరక్షణ వంటి అంశాలను రూపొందించి ప్రదర్శించారు కళాధర్ గారు.

వరంగల్ లో పుట్టి పెరిగి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అంటే  ఒక్కరోజులో జరిగే పని కాదు.  వారి అంకితభావం,శ్రమ వారిని నేడు అంతర్జాతీయ స్థాయికి చేర్చింది.  ఇప్పటికీ 7500 లకి పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చి అనేక ఆవార్డులు పోంది  ఇండియన్ మిస్టర్ బీన్ గా పేరుగడించిన మరిన్ని విజయ తీరాలను అందుకోవాలని కోరుకుంటూ.

 - రమాదేవి బాలబోయిన. 

click me!