వురిమళ్ల సునంద కవిత్వం 'గీ చేయి ఎలాంటిదో' ఇక్కడ చదవండి.
పొద్దుగాల పొరకను గుప్పిట్లో హత్తుకుని
ఇల్లూ వాకిలి శుభ్రం చేస్తుంది..
వేలి కొసలతో నైపుణ్య భాషను ఒలికిస్తూ
ముంగిట్లో రంగవల్లుల సింగిడవుతుంది!
కంపు అని ముక్కుపట్టుకుని
దూరం జరుగుతున్నోళ్ళను జూసి నవ్వుకుంట
పేడకళ్ళు తీసి గోడలకు పిడకల బొట్ట్లు పెడుతుంది
బండెడు బోళ్ళ ఒంట్లో మురికి పోయేలా చేసి
తళతళల మెరుపవుతుంది!
గుట్టలకొద్ది బట్టల వీపు చరిచి
జాడించి
దండెం మీద మిలమిలలతో మల్లెపువ్వులా మెరిసిపోతుంది
చద్దిబువ్వకు చింతకాయ తొక్కుతో పాటు
అనురాగపు నెయ్యి కలిపి
తలో ముద్దై ప్రేమగా నోటికందుతుంది
తప్పుడు మాటలు కూసే వాడి చెంపపై
ఛెళ్ళుమనే అచ్చుతో సమాధానమవుతుంది..
మంచి తనానికి గౌరవంగా సెల్యూట్ అయి మురిసిపోతుంది!
ఆషాఢం వచ్చిందంటే ఎంత ఆనందమో
అరచేతిని ఆకాశం చేసి
చుక్కలు, జాబిల్లిని
ముద్ద మందార వర్ణపు అలంకరణతో
ఆత్మీయంగా బంధిస్తుంది!
చాకిరి చేసీ చేసీ గీతలు అరిగిన అరచేతిలో
బంధాల రేఖలు మాత్రం
జెర్రిపోతులా
అనుబంధాలతో పెనవేసుకుని కనిపిస్తుంటాయి!
గీ చేతినడిగితే చెబుతుంది
చిన్నతనం నుంచి సుంతైనా ఇరాం లేక
ఎట్ల బతుకుబండి నడిపిందో
గా చేతిని తాకి చూడు
కష్టాలు కదుములు కట్టి ఎలా గిడసబారినవో
గా వెనుకున్న సుతిమెత్తని మనసు చూడు
ఇంకా చేయాలనే ఆరాటం తపన ఎంతుందో
ఒక్కసారి గాచేతిని చేతుల్లోకి తీసుకో
అందులో అమ్మ మనసు అద్దమై కనిపిస్తుంది
ఇల్లెడు సంసారాన్ని గుట్టుగా లాక్కొచ్చిన
అమ్మ పనితనం కొట్టొచ్చినట్టు దర్శనమిస్తుంది
అట్లనే గాచేతిని ముద్దాడు
చెట్టంత అమ్మ పసిపిల్లవోలె ఎంతగా ఆనందపడుతుందో
పచ్చ పచ్చని ప్రకృతిలా నవ్వుతూ
ఎన్నెన్ని దీవెనార్తులు ఇస్తుందో.