అందుకున్నాను: సాహిత్యంలో కొత్త శీర్షిక ప్రారంభం

By telugu team  |  First Published Jul 17, 2021, 2:48 PM IST

ప్రముఖ సాహిత్యవేత్త వారాల ఆనంద్ కొత్త కాలమ్ ఏషియానెట్ న్యూస్ సాహిత్య విభాగంలో ప్రారంభమవుతోంది. ఈ సోమవారం నుంచి అందుకున్నాను అనే శీర్షిక కింద పుస్తకాలను పరిచయం చేస్తారు.


హృదయం ఇంకా తేటగానే వుంది
మనసులోపల ఇంకా
తడి తడిగానే వుంది
ఎత్తిన తలింకా నిటారుగానే వుంది
అర్ధ రాత్రి కలత నిద్రలో
వెలుగును కలగంటూనే వున్నాను
నేనిప్పుడు
మౌనాన్ని మాట్లాడించే పనిలో పడ్డాను
నేస్తమా..
నాతో కలిసొస్తావా…. ఇది వారాల ఆనంద్ కవిత్వం.  
వారాల కవిత్వం ఎంతబలంగా ఉంటుందో అనువాదం కూడా అంతే బలంగా ఉంటుంది.   

కవి, అనువాదకులు, కథకులు, రచయిత, ఫిల్మ్‌మేకర్, వ్యాఖ్యాత , సీనీ విశ్లేషకులు, వ్యాస రచయిత ఇలా విభిన్న రూపాల్లో వారాల ఆనంద్‌ మనకు కనిపిస్తారు.   అక్షరాల తెరలపై కవులెందరినో వినిపిస్తుంటారు. వారాల  ఆనంద్ సృజనాత్మక జీవితంలో నటరాజ కళానికేతన్ ఒక ప్రధాన మూల మలుపు.  ఆ మలుపు వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని ప్రదర్శించడం దాకా సాగింది. 

Latest Videos

ఉస్మానియా యూనివర్సిటీ ఆయన ఆలోచనలను ప్రగతిశీలం చేసింది. 'మానేరు టైమ్స్' లో ఆయన రెండు సంవత్సరాల పాటు రాసిన 'మానేరు తీరం'  'మానేరు గలగల' గా సాహిత్య లోకాన్ని అలరించింది.   యాభై మంది ఉత్తర తెలంగాణ సాహితీవేత్తల ఇంటర్వ్యూలు ' మెరుపు' లా వెలిగినవి.  ఇంకా 'పైడి జయరాజ్' మిద్దె రాములు' మోనోగ్రాఫ్ లు  తెలంగాణ సినిమా, సాంస్కృతిక రంగానికి ఆనంద్ అందించిన విలువైన పు‌స్తకాలు.  జీవిత అనుభవాలను నిరంతరం తాత్వికతతో ప్రకటించే ప్రయత్నం చేస్తున్న వారాల ఆనంద్  ఇప్పటి వరకు వివిధ అంశాలపై 18 పుస్తకాలను వెలువరించారు.

ఆనంద్ పుట్టింది వేములవాడలోనే అయినా పెరిగింది చదివింది కరీంనగర్ లో.   ఆనంద్ జీవనయానంలో వేములవాడది ఒక ప్రధాన భూమిక.  అనేక
అనుభవాలను, ఆనందాలను, కొన్ని అవమానాలను ఆనంద్ కు  మిగిల్చిన  ఆ వూరు కొన్ని  దృశ్యాలతో ఇప్పటికీ వెంటాడుతుంది.    తిప్పాపురం బస్ స్టాండ్ , ధర్మ గుండం, మిఠాయి దుకాణాలు, బిచ్చ గాళ్ళు , తూము, పోచమ్మ,  జైన శిల్పాలు, తాతయ్య దవాఖానా , దవాఖాన్ల అమ్మమ్మ రాజేశ్వరి.  ఇవి ఆ దృశ్యాల హోరు.  వారాల ఆనంద్ ను నిత్యం  హాంట్ చేస్తున్న ఈ  ఇమేజెస్ లో  కొన్నింటిని  ‘శివ పార్వతులు’ డాక్యుమెంటరీ లో పొందు పరిచారు.  ఈ  డాక్యుమెంటరీ Slovenia ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకుంది.  ఇంకా భూటాన్, మెక్సికో లాంటి  చోట డాక్యుమెంటరీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. 

1978లో  అంపశయ్య నవీన్ ప్రారంభించిన కరీంనగర్ ఫిలిం సొసైటీకి ఆనంద్ 15 సంవత్సరాల పాటు అధ్యక్షుడుగా, కార్యదర్శిగా విశేష సేవలు అందించారు.  40 యేళ్ళ కరీంనగర్ ఫిలిం సొసైటీ చరిత్ర ఆనంద్ నిర్మించిన 'KAFISO' డాక్యుమెంటరీలో  నిక్షిప్తమై ఉంది.  సినిమా రంగంపై ఆనంద్ రాసిన ఏడు పుస్తకాల్లో అంతర్జాతీయ స్థాయి నుండి స్థానికత వరకు వివిధ అంశాలను చర్చించారు. 1981లో వేములవాడ ఫిలిం సొసైటీ తరఫున 'చయనిక' పత్రిక కూడా తీసుకొచ్చారు.


వివిధ భాషల కవిత్వంలో  వ్యక్తమైన ప్రజల ఆనందాలను, ఆవేశాలను తెలుగులోకి అనువదించి  గత ఏడు నెలలుగా 'ఇరుగు పొరుగు' శీర్షిక ద్వారా ఏసియా నెట్ న్యూస్ తెలుగు పాఠకులకు అందించి సాహిత్య ప్రేమికుల దాహం తీర్చిన  వారాల ఆనంద్ ఇక నుంచి 'అందుకున్నాను'  శీర్షిక ద్వారా మరికొన్ని కొత్త  విషయాలతో ఏసియా నెట్ న్యూస్ తెలుగు పాఠకుల ముందుకు ఈ నెల 26 నుండి  ప్రతి సోమవారం వస్తారు.
  
- ఎడిటర్

click me!