వంశీ ఓ ‘జ్ఞాపకాలు’ చెట్టు..ఆకులు పడతాయి జాగ్రత్త

By telugu team  |  First Published Jul 16, 2021, 4:03 PM IST

ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తన పొలమారిన జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని వెలువరించారు. సినీ సంగతులెన్నో ఉన్న ఈ పుస్తకాన్ని సూర్యప్రకాశ్ జోశ్యుల సమీక్షించారు.


అర్జెంటుగా   ఐదు రూపాయలు కావాలి. ఐదు రూపాయలేగా గూగుల్ పే చేసేస్తా నెంబర్ ఇవ్వు అనొద్దు..

ఇది ఇప్పటి మాట కాదు..అప్పుడు అంటే పాతికేళ్ల క్రితం నాటి విషయం. అప్పుడు నాలోంటోళ్లకి అదే పెద్ద మొత్తం. మా నాన్నగారు నా పోకెట్ మనీలు ఇచ్చేవారు కాదు..గట్టిగా అడిగితే పోకెట్ లేని చొక్కాలు కుట్టించే రకం...లేదా ఉన్న పోకెట్లు మొహమాటం లేకుండా కత్తిరించేస్తారు. ఏం చెయ్యాలి..ఏదో ఒక గేమ్ ప్లే చేయాలి. ఆయనకు నేను చెప్పగలిగే ఒకే ఒక అబద్దం..సైకిల్ పాచ్చి పడింది. ఐడియా వచ్చిన వెంటనే సైకిల్ ని ఒక ప్రెండ్ ఇంటిదగ్గర సైలెంట్ గా  పెట్టేసి, మెల్లిగా నడుచుకుంటూ ఇంటికెళ్లా. డ్రామా మొదలెట్టా. చిరాగ్గా మొహం పెట్టుకుని కూర్చుని, ప్రతీ దానికి విసుగేసుకుంటున్నా. అసలు విషయం తెలియని మా అమ్మ..ఏంటిని అడిగింది..ఏం చెప్పలేదు. ఓ ప్రక్కన నా దృష్టి అంతా గడియారం మీద ఉంది. ఒంటిగంటన్నర అవుతోంది. ఇంకెంతో సేపు లేదు. రెండున్నరకు నిడదవోలులో ఉండాలి. మా పల్లెటూరు  నుంచి నిడదవోలు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాలంటే నలభై నిముషాలు. గట్టిగా తొక్కేస్తే ఓ పదినిముషాలు కలిసొస్తుంది. అలాగే అదే చిరాకుని మొహం పై ప్లే చేస్తూ అన్నం తింటున్నా..మా అమ్మ...విషయం ఏంటని మళ్లీ అడిగింది. సైకిల్ పేశ్చి (పంక్చర్) పడిందని అన్నాను. మా నాన్నకు వినపడేలా.

Latest Videos

ఆయన రేపు ఆదివారమేగా..ఎల్లుండి పాచ్చి వేయించుకుని కాలేజీ కు వెళ్తాడులే అన్నారు. ఆ రోజు శనివారం. పాచ్చిలేసే సత్తిబాబు ఊరెళ్తాడట..మరో అబద్దం తెలియకుండానే నోట్లో నుంచి వచ్చేసింది. మా నాన్న ఏమీ మాట్లాడలేదు. నా గుండెల్లో రాయిపడింది. ఎవరిని అప్పు అడగాలా అని మైండంతా ఒకటే ఆలోచన. ఇంతకీ ఆ ఐదు రూపాయలు అర్జెన్సీ ఏమిటి అంటే...ఇప్పటిప్పుడు మేటినీ ఆట  సినిమా చూసేయాలి. పోనీ అదేమన్నా చిరంజీవి సినిమానా లేక కొత్త సినిమానా రెండూ కాదు...నిడదవోలు వెంకటేశ్వర థియోటర్ లో 'లేడీస్ టైలర్' రీరిలీజ్. ఇప్పట్లోలాగ ఎప్పుడు పడితే అప్పుడు చూసుకునేలాగ యూట్యూబ్ లు ఓటీటిలు లేవు. సినిమా అంటే థియోటర్ లోనే చూడాలి. అప్పటికి ఆ సినిమాని చాలా సార్లు చూసాను. అవకాసం దొరికినప్పుడల్లా ప్రక్కింటి వీసీపీ క్యాసెట్ లలోనూ అడపా,దడపా చూస్తున్నాను..అయినా మోజు పోలేదు. ఎందుకో తెలియదు.

అప్పట్లో ఆ సినిమా పిచ్చ. చేతిలో ఐదు రూపాయలు ఉంటే నేలలో అయినా కూర్చుని చూసేద్దామని ఆ రోజు ఫిక్సై పోయా. అలా ఆ ఐదు రూపాయలు కోసం వెర్రిత్రిపోయాలా చేసారు డైరక్టర్ వంశీ. నా జీవితంలో ఇలాంటివి బోలెడు  ‘పొలమారిన జ్ఞాపకాలు’. ఇదిగో ఈ పుస్తకం చూసినప్పుడు అదంతా పొలమారేసింది.

 నాకే నా జీవితంలో ఇలాంటివి ఎన్నో ‘పొలమారిన జ్ఞాపకాలు’ లేదా పనికిమాలిన జ్ఞాపకాలు ఉన్నప్పుడు పనికట్టుకుని వేరే వారి జ్ఞాపకాలు నేను చదవటం ఏమిటి అర్దం లేకుండా అనిపించింది. కానీ రాసింది వంశీగారు. అప్పుడప్పుడు స్వాతి పుస్తకం తిరగేసినప్పుడల్లా ఇవి తలపైకెత్తుకుని,అందమైన బొమ్మల్తో భలేగా కనపడేవి. చదివేదాకా మనస్సులో చిచ్చుపెడుతూనే ఉండేవి.  వాటికి ఎంత కనెక్ట్ అయ్యిపోయానంటే ఓ కథలో ఆయన పాకం గారెలు ఫలానా ఊళ్లో బాగుంటాయి అంటే వెతుక్కుంటూ వెళ్లేటంతగా.( నాకూ తిండిపిచ్చి ఏడ్చింది..ఫుడీస్ గ్రూప్ లో నన్ను చూడచ్చు.) చివరకు అవి అక్కడ దొరక్క..మా ఇంట్లోనే చేయించుకుని తిండి పిచ్చి అనే తిట్లుతో పాటు తిన్నాను. అంతేనా ఈ కథలు చదివాక...ఆయన ‘పొలమారిన జ్ఞాపకాలు’ మాటేమే కానీ నా జ్ఞాపకాలు కొన్ని బయిటకు తన్నుకు రావటం మొదలెట్టాయి. (లక్కీగా పుస్తకం రాయలేదు. లేకపోతే  ‘వదలనంటున్న జ్ఞాపకాలు’ అని పుస్తకం వదలాల్సి వచ్చేది). మాదీ గోదావరి జిల్లా కాబట్టి ఇలా జరిగిందనుకుంటే వరంగల్ లో ఉన్న నా ప్రెండ్ కూడా ఫోన్ లో తనకూ ఇలాగే జరిగిందని కొంతకాలం ఇలాంటి పుస్తకాలు ప్రక్కన పెట్టాయాలి లేకపోతే జ్ఞాపకాలతో జీవితం పూర్తి అయ్యిపోయేలా ఉందని వాపోయాడు. కానీ ఇలాంటి పుస్తకాలను ప్రక్కన పెట్టడం అంటే మాటలా...

అయినా వంశీగారికి ఇంత జ్ఞాపక శక్తి ఎలా ఇచ్చారో అనిపిస్తుంది. ఎప్పటి విషయాలు..ఎప్పటి విశేషాలు. అన్ని గుర్తుపట్టుకు ఇదిగో ఇలా రాయటం అంటే అప్పట్లో రాసిన డైరీలను ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నట్లే.  అయితే ఇలాంటివి జ్ఞాపకాలు చాలా మందికి ఉంటాయి.  ఎన్నో సంతోషాలు,  ఎన్నో బాధలు..ఎన్నో పరిచయాలు..ఎన్నో జ్ఞాపకాలు లేనిదెవరకి. అయితే ఇలా వాటిని అన్నిటినీ కూర్చి ఓ కథగా మార్చి.. చేయి తిరిగిన నాటకీయతతో..అద్బుతమైన క్లైమాక్స్ తో(సినిమావాడు కదా) ముగించి...నవ్విస్తూ..ఏడిపిస్తూ..ఆలోచనలో పడేస్తూ... చెప్పగలగటం ఎవరికి సాధ్యం. తెలుగు సాహిత్యంలో నాకు తెలిసి జ్ఞాపకాలను ఇలా కథలుగా ప్రెజెంట్ చేయటం ఇదే తొలిసారేమో.

నాకు నామిని మిట్టూరోడు కథలు ఇష్టం. అందులో జీవం ఉంటుంది. ఆ తర్వాత ఖదీర్ బాబు దుర్గామిట్ట కథలు, సోమరాజు సుశీల గారి ‘ఇల్లేరమ్మ కథలు’..అవన్ని నచ్చేవాడికి ఈ పుస్తకం పిచ్చగా ఎక్కేస్తుందని ఈ పుస్తకం సాక్షిగా చెప్పేస్తాను. అంతెందుకు ..ఓ పాలి ఇదిగో ఇందులో పిఠాపురం నూర్జహాన్ సెంటు కథ చదవాక మీ ముక్కుకు ఖచ్చితంగా ఆ వాసన తగలకుండా ఉంటే అప్పుడు చెప్పండి..అలాగే కథ పూర్తయ్యాక ఫోన్ తీసుకుని... పిఠాపురంలో ఆ సెంట్ అమ్ముతున్నారా చాలా  ఫేమస్ అంట కదా..అని పిఠాపురంలో ఉన్న ప్రెండ్ రమణ కు ఫోన్ చేసి అడిగేలా  చేస్తాయి.

ఇలాంటివి ఈ పుస్తకంలో బోలెడు..టెమ్ట్ చేస్తున్నాను అనుకుంటారని 'బలభద్రపురం రైల్వే స్టేషన్ కథ' గురించి ఊసెత్తటం లేదు...సుందరం పల్లి సరోజినీ గురించి గుర్తు చేయటం లేదు...ఎన్ని అనుకున్నా తాతబ్బాయి గారి టూరింగ్ టాకీస్ కథ గురించి అయితే మాట్లాడాలి..లేకపోతే మహా పాపం అని పురాణాల్లో రాసుంది. కానీ మళ్లీ మీరు చదవేటప్పుడు ఈడేంటి ఇలా ప్రతీది విప్పేసాడు.. చెప్పేసాడు..అనవసరంగా ఈ ఆర్టికల్ చదివానే అని ఫీలైపోతారని నా మనస్సుని నొక్కేసుకుంటున్నా. రివ్యూల భాషలో చెప్పాలంటే.....ప్రతికథలోనూ కనిపించే మానవతా స్పర్శ,, హృదయావిష్కరణ ఇది  ‘మన జీవితానుభవమే’ అనిపించేలా చేయటం ఆ కథల గొప్పతనం అని ఒక్క ముక్కలో తేల్చాయాలి. అయినా నాకో అనుమానం...అసలు వంశీగారు ఈ కథలు అన్నీ రాయలేదేమో..ఆ కథలే వంశీ గారు చేత రాయించుకున్నాయేమో. ప్రక్కన కూర్చుని అన్నీ గుర్తు చేస్తూ... వంశీగారే నిజం చెప్పాలి..ఏం జరిగిందో..

ఇదిగో చివరగా ఒక చిన్నగమనిక: ఏన్నో ఏళ్ల తర్వాత అటక మీద కనపడిన ఆల్బం ఒకటి తిరగేస్తూ ఒక ఫోటో చూసి పాత రోజులకు వెళ్లిపోతే ఎలా ఉంటుంది...ఇదిగో  ఈ పుస్తకం చదవుతూంటే అలాగే అయ్యిపోతాం..కష్టం..దీన్ని నుంచి అంత దొందరగా బయిటపడలేం. జాగ్రత్తగా టైమ్ తీసుకుని చదవటం మొదలెట్టాలి..ఎందుకంటే ఇందులో నెమరేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నెమలి ఈకల్లా దాచుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ప్రతీ మలుపులో,ప్రతీ కుదుపులో ఏదో ఉత్సాహం..ఉద్వేగం..కాబట్టి అంత తొందరగా రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ పుస్తకం చదివి.. మీ జ్ఞాపకాల్లోకి వెళ్లి ఆ ప్రవాహంలో కొట్టుకు పోతే..వెనక్కి రావటం ఎంత కష్టం....వంశీగారికేం..ఈ విషయం తెలిస్తే. జ్ఞాపకం పెట్టుకుని ఇంకోటి..  రాసేస్తారు. ఏమన్నా అంటే మళ్లీ పొలమారింది...అంటారు..ఆపై మీ ఇష్టం.
 
- సూర్య ప్రకాష్ జోశ్యుల 

పుస్తకాలు దొరుకు ప్లేస్
https://d-lakshmiphoenixbooksellers.dotpe.in
WhatsApp: 9110555958

click me!