ప్రతాప్ కౌటిళ్యా తెలుగు కవిత: చీకటి వెలుగులు

By telugu teamFirst Published Jun 14, 2021, 3:31 PM IST
Highlights

ప్రతాప్ కౌటిళ్యా  రాసిన కవిత  'చీకటి వెలుగులు' ఇక్కడ చదవండి.

సూర్యుల్లా వర్షం కురుస్తుంది
బంగారు వడగళ్ళు రాలుతున్నాయి
పగటి జెండా మీదా ఎండా పండు వెన్నెల్లా
స్పృశిస్తూ రహస్యంగా సంభాషిస్తుంది
నడకలలో పద్నాలుగు లోకాలు పరవశిస్తూ స్వాగతిస్తున్నాయి
మాటల పరదాలలో ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి
ఆకులతో లోకం నగ్నత్వాన్ని 
మర్మంగా దాచుకుంటూ పోతున్న 
ప్రపంచపు ప్రవచనాలని భద్రంగా
భూగర్భపు చెట్ల వేళ్ళలో అల్లు తున్నాయి
నేల వేల ఏళ్లనాటి  అస్తిపంజరాలు జోడిస్తూ మళ్లీ మనుషుల్లా నిర్మిస్తుంది
ఒక్క శబ్దం తప్ప
మాంసాన్ని కూడా చెట్ల నుంచి దిగుమతి చేసుకొని
శతాబ్దాలుగా చర్మాన్ని మాంసపు ముద్దలని
శిల్పాలుగా చెక్కుతూనే విడిపోయిన ఆడ మగ 
ఆఖరికి ఆనవాళ్లుగా కాదు 
ఆడవాళ్లు గానే మిగిలిపోతున్నారు
స్పటికం ముక్క  ఒకటి
కోట్ల సంవత్సరాలలో భూగోళాన్ని మూడు వంతులు ముంచింది
పచ్చని చెట్లు పగిలి సృష్టించిన స్పటిక మే వజ్రం అయినట్లు
అవి రాళ్లు కాదు  కళ్ళతో ఒళ్ళు పుట్టించిన నీళ్ళూ!?
శాసనాలు విశ్వాసాలు శాశ్వతాలు కాదు
ప్రాణం మనం పుట్టడం లేదు ముందుకు మరణిస్తున్నాం
అధీనంలో లేని విధి ఎవరిని వదిలిపెట్టదు సర్వస్వం సంపూర్ణం చేస్తుంది!?
ఒక పిలుపు మోసుకొచ్చిన కాలం గాలి వీచింది 
దాని శబ్దాన్ని రూపాన్ని పసిగట్టలేని  పసివాళ్లు ఇంకా
 ఆటలు ఆడుకుంటూనే ఉన్నారు
మట్టికి ఆకలి వేసింది దాహం వేసింది
దాచిపెట్టిన మేఘాన్ని పచ్చని చెట్టును పసిగట్టింది!?
కరుగుతున్న రంగులతో రంగస్థలంపై
నటులని సృష్టించిన చిత్రకారుని నవ్వు వెనుక
చీకటి ఒక్కటే కాదు వెలుగు కూడా ఉన్నట్లు
ఆధారాలు ఉన్నాయి!?

click me!