పోరెడ్డి రంగయ్య తెలుగు కవిత: ఉనికి

By telugu teamFirst Published Nov 22, 2020, 10:59 AM IST
Highlights

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం అత్యంత విశిష్టమైంది. పోరెడ్డి రంగయ్య ఉనికి పేరుతో ఓ కవిత రాశారు. ఆ కవితను మీ కోసం అందిస్తున్నాం.

సాగ నంపడం 
ఒడ్డు నైజం.
సాగిపోవడం 
నదికి సహజ గుణం.
ఐనా,
ఒడ్డు లేని నదికి ఉనికి ఎక్కడిది!

పుస్తకం
ఉన్న చోటే ఉంటుంది.
కానీ,అది ప్రసరిస్తుంది కాలమంతా.
నీటి చందాన మస్తిష్కంలో
మబ్బై రూపు కడుతుంది.
అక్షరం భిన్న రూపాల కూడలి కదా!
 

అది
నాలుగు  కూడళ్ళ మధ్య
నిశ్చల విగ్రహమే కావొచ్చు!
ఎన్ని అనుభవాలు 
మూర్తీభవించాయో!
ఆ ఆకృతిలో.
వెలిగే ఎర్ర,పసుపు,ఆకుపచ్చ
వెలుగుల సాక్షిగా
జీవితాన్ని ఎలా దాటాలో సూచిస్తుంది .

మనిషి కూడా అంతే!
జ్ఞానం
ప్రవాహశీల గుణంతో
అన్వేషియై
గ్రహాలు,నక్షత్రాలు
అగాధాలు,అనంతాలు
వశీకరణ చేసుకోవడం లేదు.!

మనసుకు రెక్కలు తొడిగి చూడు.
ఉనికి ముద్రలు పడనిదెక్కడ!
జగమంతా మనలోనిదే కదా!

click me!