కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత..

By SumaBala Bukka  |  First Published Dec 29, 2022, 9:46 AM IST

కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి అనారోగ్యం కారణంగా 44 యేళ్ళ వయసులో కన్నుమూశారు. కాళ్లతోనే కవిత్వం రాస్తూ అంగవైకల్యాన్ని అధిగమించి పలువురి ప్రశంసలు అందుకున్నారామె. 


సిరిసిల్ల : కవయిత్రి  సిరిసిల్ల రాజేశ్వరి (44) ఇక లేరు. కాళ్ళతోనే కవితలు రాస్తూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఆమె. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి  మండలం మండే పల్లిలోని  తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.  నరాలకు సంబంధించిన వ్యాధితో తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. సిరిసిల్ల రాజేశ్వరి తల్లి ఇటీవలే కన్నుమూశారు. రాజేశ్వరిని తల్లి కంటికి రెప్పలా చూసుకునే వారు. సిరిసిల్ల రాజేశ్వరిగా అందరికీ తెలిసిన బూర రాజేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. సిరిసిల్ల సాయి నగర్ లో ఉండేవారు. ఇంటర్ వరకు చదువుకుంది.

ప్రముఖ కవి, సినీ  గేయరచయిత సుద్దాల అశోక్ తేజ మాటలతో స్ఫూర్తి పొందింది. టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఆమెలోని కవయిత్రిని వెలుగులోకి వచ్చేలా చేశాయి. దీంతో చేతులు లేకపోయినా కాళ్ళతోనే కవితలు రాయడం ప్రారంభించింది. కరోనా, వరకట్న వేధింపులు లాంటి సామాజిక అంశాలతో పాటు నేత కార్మికుల వెతలు..మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , దాశరధి, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంలపై కాలితోనే కవిత్వం రాసింది.

Latest Videos

సుద్దాల స్ఫూర్తితో కవిత్వం రాయడం మొదలు పెట్టిన ఆమె  ఆమె సాహిత్యాన్ని, అందులో ఆమె కృషిని  అశోక్ తేజ మెచ్చుకున్నారు. సుద్దాల అశోక్ తేజ అనే ఆమెకు సిరిసిల్ల రాజేశ్వరి అనే పేరును పెట్టారు. అమ్మ రాసిన కవిత ల తో ఒక పుస్తకాన్ని అచ్చు వేయించారు. సుద్దాల అశోక్ తేజ చొరవతో సిరిసిల్ల రాజేశ్వరి జీవిత చరిత్రను  మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు పాఠ్యపుస్తకంలో ఓ లెసన్ గా చేర్చారు. అలా రాజేశ్వరికి గుర్తింపు తెచ్చారు.

సంతాపం తెలిపిన కేటీఆర్
సిరిసిల్ల రాజేశ్వరి మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజేశ్వరి మృతి విషయంలో సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన చేశారు. నిరుపేద చేనేత కుటుంబంలో ఆమె జన్మించారని.. ఆత్మవిశ్వాసానికి అంగవైకల్యం అడ్డు రాదని  నిరూపించారని అన్నారు. కాళ్లనే చేతులుగా మలచుకుని.. కవితలు రాసిన తీరు అద్భుతమని అన్నారు. ఆమె జీవన ప్రయాణం స్పూర్తివంతమైన దని.. ఎంతో మందికి ఆదర్శనీయమని  తెలిపారు. సిరిసిల్ల రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. సిరిసిల్ల రాజేశ్వరి మృతిపట్ల జిల్లాలోని కవులు,  రచయితలందరూ సంతాపం ప్రకటించారు. 

click me!