ఈరోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఆవిష్కరిస్తున్న గుడిపల్లి నిరంజన్ కవితా సంపుటి “వెన్నెల కల” కు డా. సిద్దెంకి యాదగిరి రాసిన ముందు మాటలోని కొంత భాగం ఇక్కడ చదవండి :
మట్టి పొత్తిళ్ల పరిమళం మరుగునపడ్డ చరిత్రను తిరగరాస్తుంది. పుటం వేసిన తీరు పునర్లిఖిస్తుంది. ముప్పును పసిగట్టి డప్పులా చాటింపు చేస్తుంది. మేల్కొల్పుతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా, భవిష్యత్తు తరాలు స్మరించుకునేలా నిజాన్ని ఆవిష్కరిస్తుంది. మట్టి పొత్తిళ్ల చైతన్యం అంతర్లీనంగా ఉన్న జడత్వాన్ని తొలగిస్తుంది. మనుషుల్ని, మనసుల్ని మేల్కొల్పి ఆచరణశీలురగా తీర్చిదిద్దుతుంది. మనిషిని ప్రభావితం చేస్తుంది.
చరిత్రపొరల కింద దాగిన వాస్తవాన్ని, వేల ఏళ్లుగా దాచిన వెలివాడల చరిత్రను, వర్తమాన సమాజాన్ని ఆష్కరిస్తున్న కవి. అంతరాలు లేని సమాంతర సమాజాన్ని నిరంతరం కలగంటున్న కాలంయోధుడు, మూలవాసి. అస్తిత్వాన్ని ప్రకటిస్తున్న అక్షరధారి. జంబూద్వీపతత్వమే ఈ దేశానికి ప్రమాణమనీ ప్రకటిస్తున్న ఆదిజాంబవుడి వారసుడు గుడిపల్లి నిరంజన్.
రేపటి తరానికి సాక్షిభూతంగా, మార్గదర్శనంగా నిలుస్తున్న కవిత్వం గుడిపల్లి నిరంజన్ ది. సునిశిత పరిశీలన, పదునైన అభివ్యక్తి, ఆకట్టుకునే శైలి గుడిపల్లి సొంతం. దళిత బహుజన అస్తిత్వం, తెలంగాణ స్థానికత ఆలంబనగా ఇప్పటికే లంద పొద్దు, ఎరుక, మొదలైన కవితా సంపుటాలను వెలువరించి తెలుగు కవితా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ‘వెన్నెల కల’ తన కవితా సంపుటితో మిగిలిన కలల్ని మిగ్గులో ముంచి మనకు అందిస్తున్నాడు.
గుడిపల్లి నిరంజన్ కవి, కథకులు, విమర్శకులు, వక్త, సంపాదకులు. సంఘ సంస్కర్తలగు ఫూలే, అంబేద్కర్ బాటలో సాగే కార్యకర్త. వీరి సాహిత్యంలో మానవజాతి ప్రయోజనాలు అధికం. అధికారాన్ని అందుకోలేని జాతులు అంతరిస్తాయి అని చెప్పిన కాన్షీరాం బాటలో బహుజన రాజ్యం కోసం నిరంతరం తపించే మేధావుల్లో ఒకరు. వృత్తి ఉపాధ్యాయుడు. ప్రవృత్తి సాహితీ సృజనశీలి. సామాజిక కార్యకర్త.
సంగిశెట్టి శ్రీనివాస్ తొ కలిసి తెలంగాణ దళిత కథలు తేవడంలోనూ, జంబూ సాహితి ద్వారా ప్రసంగాలు చేయడంలోనూ మేము (నేను, తప్పెట ఓదయ్య) దళిత కథా వార్షిక తేవడంలోను కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిజం చెప్పాలంటే దళిత సాహిత్యానికి కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చిన కొడుకు. హంగూ ఆర్భాటం లేని నిజాయితీ గల సాహిత్య సైనికుడు నిరంజన్.
ఈ దేశ మూలవాసుల సంస్కృతిని, జీవన విధానాన్ని నేటి, రేపటి తరాలకు అందిస్తున్న ఆశయవాది. జంబుతత్వాన్ని, ఆకాశపందిరి కింది అక్షరాలను కొంగవాలు కత్తితో తిప్పుతున్న జాంబవంతుని వారసుడు. మొగులుమీద ఒక అడుగు, నేలమీదో అడుగు అన్నట్లు తన కవిత్వాన్ని సంధిస్తూ చిందేస్తున్నాడు. మానవవాదాన్ని మహోన్నత వెలుగులుగా వెదజల్లాలని ‘వెన్నెల కల’గా మనకందిస్తున్నాడు.
మనిషిని సంస్కరించేది, దార్శనికతని చూపేది, మేలుచేసేదే కవిత్వమని బలంగా నమ్మే కవి గుడిపల్లి.
Poetry is itseft cleanless అని వ్యక్తీకరిస్తాడు.
శత్రువెవరో మనకు మనమే నిర్ధారించుకునేలా మార్గదర్శనం చేస్తాడు. త్రిశూలాలు సుదర్శన చక్రాలు రాజ్యాంగాన్ని హత్య చేయనిదే సూర్య నమస్కారాలు పూర్తి కావనీ కుట్రలను పసికడతాడు. సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చిన ప్రత్యేకాంశాలను వ్యంగ్యంగా నిరసిస్తాడు. ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగినోళ్ళకు ఆధారాలా అని ప్రశ్నిస్తాడు. ముంచుకొస్తున్న ముప్పును గుర్తించి మనల్ని అప్రమత్తం చేస్తాడు.
అడ్రస్ గల్లంతైనోన్ని సామి
గిప్పుడు ఏ ఆధారం జూపిత్తు.......
అయితే రా మా తాత ఆది జాంబవుడిని
సమాధిలో నుండి లేపి చూపిస్తా....
గో టూ మధ్యాసియా అని దగ్ధమైపోతుదీమట్టీ అనే కవితలో నీవు వచ్చిన తోవెంట మధ్యాసియాకు వెళ్లొచ్చునని నిరసిస్తాడు.
నిరంజన్ స్త్రీవాద కోణంలో రాసిన కవితలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమ్మ మీది అతని ప్రేమ ఏ కొలతకందది. ఏ తూనిక రాళ్ళకి అందది. ప్రతి అంశంలోనూ అనేక కోణాల్లోనూ అమ్మను వెతుకుతాడు. వాళ్ళ అమ్మను మనకు చూపెడుతుంటే పాఠకునికి తన అమ్మే గుర్తొస్తుంది. అమ్మలేనితనాన్ని వివరిస్తుంటే కళ్ళు చెమ్మగిళ్లకమానవు. అమ్మను ప్రేమించే కొడుక్కు అమ్మ తనని వదిలి పోయేసరికి తన బాధను చెపుతుంటే మనసు చెమ్మగిల్లుతుంది.
ఎవరి అమ్మయినా
వెళ్ళిపోయాక
ఖాళీగానే కనబడుతుంది అని మన మనసును విషన్న వదనంగా మార్చుతాడు. కవిత ప్రారంభంలోనే తన కవితావాక్యాలతో మన గుండె పట్టేస్తాడు. మరొక కవిత చదువాలంటే కొంత సమయమైన కావలసిందే. అమ్మ మీదే రాసిన మరో కవితలో
అమ్మ రాకపోయినా
ఆకాశాన్ని
బహుమానంగా పంపిందని ముగిస్తాడు.
చట్టం ముందు అందరూ సమానమేనని అందరికీ ఒకే శిక్ష పడాలని అమలు కాని చట్టాన్ని ప్రశ్నిస్తాడు. అట్టడుగు బడుగు బలహీన స్త్రీల కోణంలోంచి న్యాయం కోసం గొంతెత్తుతాడు. దిశ హంతకులను కాల్చేసి టేకుల లక్ష్మి హంతకులను శిక్షించకపోవడాన్ని నిరసిస్తూ రాసిన కవిత రూల్ ఆఫ్ లా.
ఈతాకులిచ్చి తాటాకులు దొబ్బుకపోయే రాజకీయాన్ని చెరిగిపోస్తాడు. వ్యాపారమవుతున్న మనిషిని చూసి బాధపడుతాడు. ప్రతి మాట వెనుక ఉన్న వాణిజ్యాన్ని బహు ముఖాలను పరిచయం చేస్తాడు. పచ్చి పచ్చి నిజాలను ‘మారు ముఖం’ కవితలో ప్రవచిస్తాడు.
ఎప్పటికైనా మిణుగురు పురుగు కాంతినే వదులుతుంది
మన తాతల త్యాగాన్ని తలకెత్తుకోవడం
ఇప్పటి విద్యుక్త ధర్మం
మరి వస్తావా అని ప్రశ్నిస్తూ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఆచరించే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తాడు. అడుగులు వేయిస్తాడు.
దేశమంతా మత రాజకీయం పులుముకున్నది. అసహనం పెరిగిపోతుంది. కళ్లెదుటే అన్యాయం జరుగుతుంది. మనుషుల అలవాట్లు, ఆచారాలు ఆఖరికి ఆహారం పైన నియంత్రణ ఏందని నిలదీస్తాడు. గోమాంసం భక్షిస్తున్నాడని ఆక్లిక్ పై దాడి చేసిన ఘటనలు కలవు. మా ఆహారంపై నీ నియంత్రణ ఏమిటనీ ప్రశ్నిస్తూ ' సియ్య పై గుడి నీడ 'అనే కవితలో
చిన్న చిన్నగా నా బతుకు పైనే కాదు
సియ్యపై గుడి నీడ పరుచుకుంటుంది
ఆధునిక యుగం నుండి ఆవు యుగం దాకా నడుస్తోందని విచారం వ్యక్తం చేస్తాడు.
ఒకవైపు భారతదేశం వజ్రోత్సవ వేడుకల్లో మునిగి తేలుతుంటే కులవివక్ష దళితుల మీద దాడులు చేస్తూనే ఉంది. నీళ్లు తాగితే కొట్టడం. పెళ్లి వేడుకలో గుర్రం మీద ఊరేగితే దాడి చేయడం లాంటి అమానుషమైన ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడని దుర్మార్గం కొనసాగుతుందని కవిగా బాధపడతాడు. ఘటనల్లో బాధితుడుతానై ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాడు.
ఇవాళ గుర్రమెక్కితేనే సహించనోడివి
రేపు సింహాసనం ఎక్కుతా
ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉండు
అప్పుడు నా డప్పు
కీలుగు గుర్రం దరువై ఆడుతుంది అని ‘అంతరం’లో చిత్రిస్తాడు.
స్వాతంత్రం వచ్చిందని 75 సంవత్సరాలు గడిచాయని దేశభక్తిని చాటడానికి నేతలు ప్రజల్ని పురుకొలుపుతున్నారు సరే! మరి నిజమైన స్వాతంత్య్రం ఏదనీ గుడిపల్లి ప్రశ్నిస్తున్నాడు. దేశభక్తి డిపిల రూపంలో మేల్కొంటుందని కవితను ప్రారంభిస్తాడు. పేదరికం అలాగే ఉందని అంతర్జాతీయ ఆకలి సూచీలో దేశం రోజురోజుకు ఎగబాకుతుందని బాధపడుతాడు.
ఆకలి సూచీలు అంతం కాలే
ఇది భిన్నత్వం కలిగిన దేశం
భిన్న పేదరికాలు ఉంటాయి
అయినా ఇక ఎగరేస్తాం జెండా
గుండెల నిండా
కల్తీ లేని దేశభక్తితో అని రాజకీయాలకు అతీతమైన నిజాయితీ కలిగిన దేశభక్తిని ప్రకటిస్తాడు.
పగిలిన అద్దంలో అనేక ముఖాలున్నట్లు
మృత్యువుక్కూడా ఇన్ని ముఖాలు ఉంటాయనీ
ఎవరూ ఊహించి ఉండరు. (నా బొడ్డు ఏడుస్తోంది) అని ఒక చిన్న జీవి ప్రపంచానికి ఒక గుణపాఠం చెప్పేవరకు సంపదతో మిడిసిపడుతున్న మానవుని తల తీసేసినట్లయింది. చిన్న గాయానికే తల్లడిల్లే నిరంజన్ లాక్డౌన్ చూస్తూ పద్యం రాయకుండా ఉండగలడా? కరోనాను మరణ విస్ఫోటనం ఆపమని వేడుకుంటాడు.
దండకారణ్యం అంటే ఒక పులకింత. రత్న గర్భను తవ్వడానికి అడవిని నాశనం చేస్తామంటే కవి మనసు ఊరుకోదు. సామాజిక బాధ్యత కలిగిన కవి నిరంజన్ పచ్చనాకు సాక్షిగా “నా రక్తాన్ని పరీక్షించు నరనరాల్లో నల్లమలే ప్రవహిస్తోంది. నిలిచి గెలిచే నేలను ఈనుతుందనీ ప్రతిఘటిస్తాడు. కవి అంటే ఎన్నిక కానీ ప్రజాప్రతినిధి. ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని కుట్రల్నీ ఎలా చూస్తే అవగతమౌతుందో తెలుపుతూ మనకొక కొత్త చూపును అందిస్తాడు. “కొన్ని కుట్రలూ అంతే
జ్ఞాన నేత్రం తెరచి చూస్తే తప్ప అవగతమవ్వవు
సమస్యల్లా జ్ఞాన నేత్రం తెరువడంలోనే” అని చూపు కవిత ద్వారా ప్రకటిస్తాడు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ప్రజల బాధని కవిత్వీకరించాడు. మాట మాటకు బంగారు తెలంగాణగా వర్ణించే వారికి జ్ఞాన బోధ జేస్తూ
“ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ తెలంగాణలో
ఇప్పుడు ఏ ప్రశ్న అడిగినా
సమాధానం శూన్యమే " అని వాస్తవాన్ని ప్రకటిస్తాడు.
ప్రజల్ని మేల్కొలిపే పాట తెలంగాణను ప్రభావితం చేసింది. అలాంటి పాట ఎవరి దగ్గర ఊడిగం చేస్తోందనీ ‘వలసెల్లిన పాట’లో బాధపడుతాడు. పాట మళ్ళీ పుట్టు /
నిన్ను జంబూ ద్వీప రాజ్యానికి /
ప్రభాత గీతికను చేస్తా..” అంటూ భరోసా కల్పిస్తాడు.
మేమే ఈ దేశ అసలు వారసులం అంటూ ' వెన్నెల కల ' కవితలో -
భూమిపై మొదటి మనుషులం
ఆదిలోనే పాలకులం
గాయపడిన చరిత్ర చంద్రుల్నీ
తిరిగి తిరిగి వెలిగింపజేస్తూ
అది మళ్లీ మళ్లీ నిజం చేద్దాం
రాజ్యాధికారంను ముద్దాడుదాం - అని పాలనా సిద్ధాంతం విప్పి చెప్పడం ఎంత ముఖ్యమో అధికారాన్ని అందుకోవడం అంతే ముఖ్యమంటాడు. బహుజన అంతిమ లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు నూతనంగా వ్యక్తీకరిస్తాడు.
నిరంజన్ అనేక కోణాల్లో కవిత్వాన్ని ఆవిష్కరించాడు. వస్తు విస్తృతి, వస్తు నవ్యత, వినూత్న అభివ్యక్తి విన్యాసం అమోఘంగా ఉంది. అక్షరాలను ఆర్థ్రంగా పలికించగలడు. ఆవేశాలను తొడుగగలడు. సమస్యని కవిత్వం చేయగలడు. పరిష్కారాన్ని సాహిత్యంలో చూపగలడు. కానీ రాయవలసినంత రాయకపోవడమే బాధాకరం.