చావుకు బతుక్కి మధ్య నరకాన్నిచూపి అర్థభాగాన్ని అర్థంతరంగా సాగనంపే జననీ అంటూ మధుకర్ వైద్యుల రాసిన కవిత ' అర్థనారీశ్వరం ' ఇక్కడ చదవండి :
కరిగిన కాలం కల్లోలం రేపుతుంది
కాటికి రమ్మని కబురంపుతుంది
చేతకాని చేవలేని బతుకెందుకని
చావు చావమంటూ శాపనార్థాలు
నాలుగుపదుల జీవితం నరకప్రాయం
గెలుపును జయించిన ఓటములనేకం
ఆనంద గడియలు మాయమై ఎన్నాళ్లో
నవ్వును మొలిపించని లాఫింగ్ థెరఫీ
మనిషికి మస్తిష్కానికి అనుసంధానం తెగి
కుప్పకూలిన నాడీవ్యవస్థకు చికిత్సలేక
ఛిన్నాభిన్నమైన అవయవవ్యవస్థకు
శస్త్రచికిత్స చేసినా ఒక్కటి కాలేని దూరం
నిత్యం సంఘర్షణలతో సహజీవనం చేస్తూ
అనునిత్యం అవమానాలతో సహవాసం
ఎవరికీ చెప్పుకోలేక ఎటూ తేల్చుకోలేక
కడుపు చించుకుని ఏడ్చినా రాని కన్నీళ్లు
బంధమనే కారగారంలో బందీగా మార్చి
ప్రేమానురాగాల చీకటి తెరల మాటున
గుండెల నిండుగా తిట్ల గునపాలు దింపి
కనిపించని గాయాలు రేపుతున్న నొప్పి
మానని పుండ్లను పిన్నీసుతో గుచ్చి
చావుకు బతుక్కి మధ్య నరకాన్నిచూపి
తనువంతా రక్తసిక్తమైనా మనసు కరగక
అర్థభాగాన్ని అర్థంతరంగా సాగనంపే జననీ
(భార్యల చేతిలో హత్యలకు గురవుతున్న భర్తలను దృష్టిలో పెట్టుకుని రాసిన కవిత)