నగరం ఎప్పుడూ ప్రశాంతంగా నిద్ర పోదు అంటూ ఖమ్మం నుండి అంజనా శ్రీ రాసిన కవిత ' నగరం' ఇక్కడ చదవండి :
పేదలు ధనవంతులు అల్లిబిల్లిగా అల్లుకున్న నిలయం గుండెల్లో ఎన్నో గాధల వలయం
మురికివాడలతో బాధల వేదనల కన్నీళ్లతో నగరం
అద్దాలు పరిచిన రోడ్లతో దగదగల నగరం
నగరం నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా
సంచారం చేస్తూనే ఉంటుంది
నగరం అర్ధరాత్రి కూడా మేల్కొంటుంది
నగరానికి ఆధునిక జీవనం తెలుసు
నగరానికి సగటు జీవి అంటే అలుసు
ఉద్యోగ నిరుద్యోగులను కడుపులో దాచుకున్న నగరం
ఎప్పుడూ నిశ్శబ్దంగా నిద్రపోదు
ఏదో అలజడి
ఏదో సందడి
ఏదో కలకలం వినిపిస్తూనే ఉంటుంది
నగరాన్ని కదిలించకండి
అది ఎన్నో గాయాల మాలల్ని మోస్తున్న దుఃఖ సముద్రం
నగరం నీకు ఒక ప్రేమ నగరే కావచ్చు
మరొకరికి మూసి మురికి కాలువ
నగరం ఎప్పుడూ ప్రశాంతంగా నిద్ర పోదు