ఆఖరు గది !

By SumaBala Bukka  |  First Published May 31, 2023, 3:01 PM IST

హెచ్చుతగ్గుల్ని తారతమ్యాల్ని కులమతాల్ని వర్గవివాదాల్ని 
సాపు చేసి సరిసమానం చేసి  అంటూ విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత ' ఆఖరు గది ! ' ఇక్కడ చదవండి : 


ఆస్పత్రి గోడకు 
ఆకలి దప్పులు అడగకుండా అల్లుకుని
ఆకులు లేని తీగై పెనవేస్తూ...
ఉత్సవం సద్దుమణిగిన సంక్షోభాన్ని
ఉస్సురంటూ ఊపిర్లు లేకుండా చూస్తూ...

ఒక జ్వలిత నక్షత్రం 
కేంద్రాభిముఖంగా కృష్ణబిలమై కుచించుకుని 
కరడుగట్టిన కణాల కేకల్ని 
అణగార్చిన ఆర్భాటాలను పేల్చకుండా పేరుస్తూ... 

Latest Videos

రాలిపోయిన ఆశలన్నీ 
సీతాకోకచిలుకలై మారలేక 
ప్యూపాలై పూడుకుపోయి 
తిరిగి తలెత్తలేని తిరోగమనాన్ని  తిలకిస్తూ... 

సెలయేటి చివరిగట్లను చీర్చినా
చిటపటలాడే చింతలను
నిరాకార చింతనతో నిర్వీర్యం చేసినా
నివ్వెరపోని నిమీలనాన్ని నెమరేస్తూ...

హెచ్చుతగ్గుల్ని తారతమ్యాల్ని 
కులమతాల్ని వర్గవివాదాల్ని 
సాపు చేసి సరిసమానం చేసి 
కురచ తనపు కల్మషం కడిగేసేలా కనికరుస్తూ...

తలుపు సందున తల్లడిల్లి నలిగిన బల్లికి..
ఊగి ఊగి తెగిపడ్డ తుది ఊహకు..
కరిగి కరిగి కాలంలో కలుస్తున్న శ్వాసకు..
బ్రతుకు గుంజాటనను మరిపించే వరంగా..
స్థావర జంగమపు శాంతి స్థావరంగా..
చిట్ట చివరి స్నేహం గా  వరిస్తూ ...

ఆ ఆఖరు గది లో, 
తగిలిన ఒక శీతల మృత్యు శీల స్పర్శ..  
అద్దిన జేగురు రంగు మల్హం ముగింపు !!!  
(  నిమీలనం- మృత్యువు   , ఆఖరు గది- Mortuary)
 

click me!