ఫణి మాధవి తెలుగు కవిత: తుషార వీధి

By telugu teamFirst Published Nov 26, 2021, 3:00 PM IST
Highlights

తనపై జరిగిన అవమానాన్ని మీఆరు రుతువులను నిబ్బరంగా హత్తుకుంటున్న నేల స్వభావాన్ని మనలోకి ఒంపుకొంటున్న పెనుగులాటను ఖమ్మం నుండి రాస్తున్న ఫణిమాధవి కన్నోజు "తుషార వీధి" లో చూడండి

తెల్లగా మొగ్గవేసి బచ్చలిపండు రంగులో  విచ్చుకుంటున్న రాధామనోహరం చల్లగా పలకరించింది. తలెత్తి నలుదిశలు పరికించినా దరి చిక్కని ఆకసం. దరులకై వెతికిన అమాయకత్వం నవ్వై విరిసింది.  ఉలుకుల నులక మంచం పైన వలపుల చుక్కల్ని లెక్కెడుతూ తళుకులన్నీ ఇహ తన సొంతమనుకుంటూ,  ముగియబోయే రాతిరి మీంచి రాబోయే వేకువకై తీయని స్వప్నం. ప్రభాత రాగాలేవో స్వరం సవరించుకుంటూ సిద్ధమయేది తన కోసమేనని. 

తూరుపు రేఖలు సోకగనె తేనియ పులకరింత. ఏదీ కాని లోకం నుంచి మరేదో అయిన లోకంలోకి వెళ్ళినట్టు. వీచే గాలి మెరిసే మేఘం కురిసే చినుకు సొంతమైపోయినట్టు. అప్పటివరకూ ముడుచుకున్న రెక్కలు విచ్చుకున్నట్టు. లేని ధైర్యమేదో నిండినట్టు. మోహమొహటి కమ్మేసి చుట్టూ చరించేవేవీ ఆనవు. నాల్గు మూలల మధ్యనే ముల్లోకాల సంతోషాన్ని పోగు చేసుకున్నట్టు. క్షణాలన్నీ చక్రాలు కట్టుకుని పరుగులు పెడుతున్నట్టు. రోజులన్నీ రాసి ఉన్నది తన పేరునే అన్నట్టు.

గుత్తులు గుత్తులుగా విరిసి మురిపిస్తది ముక్కుపుడకల మొక్క. దగ్గరగా వెళ్ళి ఊపిరి పీలిస్తే ఉబ్బసం తెప్పిస్తది. అంతా ఓ ఇంద్రజాలమల్లే. మరేవో లోకాల మత్తు దిగిపోతుంది. అల్లన అక్కడెక్కడో ఉన్న చూపు వాస్తవపు లోయల్లోకి ప్రసరిస్తుంది. పరిసరాలన్నీ కక్ష కట్టినట్టు, గాలి కసురుతుంది, నీరు కరుస్తుంది, ఆకాశం కవ్విస్తుంది. సెగలేవో చురుక్కుమంటూ నిజాల ఉనికిని చాటుతాయి. కల చివర వేలాడిన ధైర్యం మెలకువలో మాయం.

తోడు నిలవడమంటే చుట్టూతా చీకటి కమ్మేసినపుడు, వెలుగొచ్చాక వచ్చి చూడటం కాదు, వెలుతురై చీకటిని తరమడం. చేతవకపోతే కాసేపైనా ఆ చీకటిలో కలిసే ఉన్నట్టు అనిపించడం. లోన గొణుగుడు‌.

తెల్లారుతుంది. రోజు గడుస్తుంది. ఏ చడీచప్పుడూ లేకుండానే సూర్యుడు ఉదయిస్తుంటాడు. ఏ రాగాలూ ఆలపించకుండానే క్షణాలు దొర్లిపోతుంటాయి. నుసిబారిన మోహం కాటుకలిసి పోతుంది.

ఏవో కొన్ని జీవం నిండిన క్షణాలు కొన్ని కలల్ని ఇస్తాయి. మురిపిస్తాయి. పేరుకుపోయిన లోపలి స్వరాల్ని శృతి చేస్తాయి. సరికొత్త రాగాల్ని ఆలపిస్తాయి. హు.‌. నిలకడ తెలియని క్షణాలు. కరిగిపోవటం ఎంతసేపు. ఆ లోపలి స్వరాలే, మరల పూర్వస్థితిలోకి వచ్చేందుకు ‌ఎంత పెనుగులాట. నేల మహా నిబ్బరం గలది వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిశిరాలను ఒక్క తీరుగ హత్తుకుంటుంది. దిగులుపూలు విరియటం రాలటం స్వభావసిద్ధం. కాలం నేర్పిన సహజత్వం. దూదిపాల తీగల్లే అల్లుకుని, తత్వం తేటగ తేల్తుంది.

click me!