గండ్ర లక్ష్మణరావు ముందు మాటల "ప్రస్తావన"

By telugu team  |  First Published Nov 22, 2021, 9:19 AM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు “ప్రస్తావన” అందిస్తున్నారు వారాల ఆనంద్.


టీవలే ఆత్మీయులు డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు గారి ‘ప్రస్తావన’ అందుకున్నాను. చదివాను. దాని గురించి నాలుగు మాటలు రాయాలనిపించింది. అందుకే ఈ వారం ‘అందుకున్నాను’ లో  ఈ ‘ప్రస్తావన’ .

లక్ష్మణ రావు గారు మంచి కవి, విమర్శకులు, గొప్ప వక్త. కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య “సాహితీ గౌతమి” అధ్యక్షులు. అంతే కాకుండా జిల్లాలో జరిగే అన్ని సాహితీ సంస్థల కార్యక్రమాలకు ఆయన ప్రేరణ. గత ముప్పై ఏళ్లుగా సాహితీ గౌతమీ నిర్వహిస్తున్న ‘సినారె సాహితీ పురస్కారం’ నిర్వహణలో ఆయన ప్రధాన  భాగస్వాముల్లో ఒకరు. ఇట్లా బహుముఖీనమయిన సాహితీ కార్యక్రమాలు నిర్వహించే గండ్ర లక్ష్మణ రావుకు ప్రాచీన సాహిత్యం మీద గొప్ప పట్టు వుంది. ఆయన మంచి పండితుడు. ధారాళంగా పద్యాలు, శ్లోకాలు చెప్పగలరు. ఆయన ధారణాశక్తి అభినందనీయమయింది. అనేక రచనలు చేసారు. అభినందనలు పురస్కారాలు అందుకున్నారు.

Latest Videos

ఆయన వెలువరించిన కొత్త పుస్తకం ‘ప్రస్తావన’ ను ఆయన ప్రత్యక్ష గురువు సినారె కు అంకితమిచ్చారు. ఇందులో వివిధ రచయితలు, కవులు రాసిన పుస్తకాలకు లక్ష్మణ రావు రాసిన ముందుమాటలు క్రోడీకరించి ప్రచురించారు. దీన్ని ఆయన శిష్యుడు కవి, వ్యాఖ్యాత కే.ఎస్.అనంతాచార్య సంకలనం చేసారు.

 ఆధునిక తెలుగు కవిత్వం లో ‘ముందు మాటలు’ అనగానే శ్రీ శ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతా పత్రం గుర్తొస్తుంది. కవిత్వాన్ని తూచే రాళ్ళు తన వద్ద లేవు అని చలం అంటే అనుభవించి పలవరించమని శ్రీ శ్రీ అన్నాడు. ఫలితంగా వచ్చిన యోగ్యతాపత్రం నాటికీ నేటికీ ‘మహాప్రస్తానమంత’ పేరునూ ఖ్యాతిని సాహిత్యంలో స్థానాన్నీ పొందింది. అట్లా ఒక పుస్తకానికి ‘ముందు మాట’ అంటే కేవలం నాలుగు ప్రశంసలు, ఏవో రెండు సూచనలూ కావు. ఎవరో  ప్రముఖుడో, అధికారో రాసే అభినందన వాక్యాలు కావు. లేదా గురువు శిష్యుడికి ఇచ్చే కేవల ఆశీర్వాదమూ కాదు.

ముందుమాట ఒక పుస్తకానికి అందమయిన కళాత్మకమయిన ‘గవాక్షం’ లాంటిది. అది ఆ పుస్తకం లో ఏముందో చెప్పాలి. ఆ పుస్తకంలోనికి పాఠకుడు ఎందుకు వెళ్ళాలో సూచించాలి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో.. ఎట్లా అన్వయించు కోవాలో కూడా సూచించాలి. అప్పుడే ఆ ముందుమాట ఆ కవీ/ రచయితకు న్యాయం చేసినట్టు అవుతుంది. చదువరి ముందు మాట చదివి ఉత్సాహంగా పుస్తకంలోకి వెళ్ళగలిగినప్పుడే దానికి సార్థకత. ఇక ముందుమాటలు రాయడం రాయించుకోవడం సాహిత్య ప్రపంచంలో పాత ముచ్చటే. అయితే దాన్ని పలువురు పలు మాటలతో పలుశీర్షికలతో రాసారు. అనేక సార్లు అభినందన, అవతారిక, ఆముఖం, ఆశంస, ఆశీస్సు, ఉపోద్ఘాతం, భూమిక, మంగళ శాసనం, ప్రవేశిక, పరిచయం, యోగ్యతాపత్రం, విజ్ఞప్తి, నివేదన, లాంటి సంస్కృత పదాలతో రాయగా, మరికొన్నిసార్లు  మున్నుడి, తెలివిడి, తొలిపలుకు, మనవి, ఒక మాట, రెండు మాటలు, ముందుమాట.. ఇట్లా తెలుగు మాటలతో రాసారు. ఇది తెలుగులోనే కాదు ఇంగ్లీషులో కూడా వుంది వాళ్ళు ప్రధానంగా exordium, foreword,  Intro, introduction, preamble, prelude, proem, prologue, Prolusion లాంటి శీర్షికలతో ముందు మాటలు రాసారు రాస్తున్నారు. అట్లా దాదాపు అన్ని భాషా సాహిత్యాల్లో ఈ ముందు మాటల ఆనవాయితీ వుంది.

అయితే ఈ ముందు మాటలు (లేదా మరే పేరు మీద రాసినా) అవి రాసే వాళ్ళ పాండిత్య ప్రకటనగానూ సమీక్షలానూ ఉండకూడదని నేననుకుంటాను. అందుకే ఒక పుస్తకానికి ముందు మాట రాయడానికి అది రాసే వాడికి ఆ అర్హత, రాసే తీరిక, ప్రతిభ, స్పష్టత వుండాలి. అప్పుడే వాటిని రాయించుకున్న వారికి రాసిన వారికి పేరు గౌరవం దక్కుతాయి. సాహిత్య రంగంలో గుర్తింపూ లభిస్తాయి.

అందుకే ముందుమాట ఆలవోక రచన కాదు. అత్యంత బాధ్యతతో కూడుకున్నది. సాహిత్యం లో దాన్ని ఒక విలక్షణ ప్రక్రియగా చూడాల్సి వుంటుంది.

అయితే చాలా సార్లు చాలా పుస్తకాలకు ఎంతో మంది రాసిన ముందుమాటలు కాలగర్భంలో కలిసిపోతాయి. మరుగున పడిపోతాయి. రాసినవాళ్ళు రాయించుకున్న వాళ్ళు కూడా మర్చిపోతారు. కాని ఒక రచయిత తాను వివిధ కాలాల్లో పలువురు రచయితలకు కవులకు రాసిన ముందుమాటలని ఒకచోట చేర్చి చూసినప్పుడు అనేక విషయాలు అవగతమవుతాయి. ఆయా కాలాల్లో ఎలాంటి పుస్తకాలు వెలువడ్డాయి, ఎట్లా రాసారో తెలుస్తుంది. అంతే కాదు ముందుమాటలు రాసిన సాహిత్యకారుడు ఆయా సందర్భాల్లో ఎట్లా ఆలోచించాడు, ఎట్లా స్పందించాడో కూడా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. అంతే కాదు ఆ పుస్తకాల మూల రచయితలు ఎంత మేరకు నిలబడ్డారో, నిలిచిపోయారో కూడా తెలిసి పోతుంది.

అందుకే గండ్ర లక్ష్మణ రావు గారి ‘ప్రస్తావన’ మంచి ప్రచురణ అని నేననుకుంటున్నాను. ఆయన రాసిన ఈ 40 ముందు మాటల్లో పద్య కవిత్వం, వచన కవిత్వం, నానీలు,శతకాలూ, ఉదాహరణ కావ్యాలూ, అభినందన సంచికలూ వున్నాయి. వీటిల్లో శ్రీభాష్యం విజయ సారధి గారి ‘కామాయణం’ సంస్కృత కావ్యానికి రాసిన ముందుమాటతో పాటు కే.ఎస్.అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్ రాసిన నానీల వరకు వున్నాయి.

గండ్ర లక్ష్మణ రావు ఈ ‘ప్రస్తావన’లో సంకలనం చేసినవే కాకుండా మరెన్నో ముందుమాటలు రాసారు. అంతే కాదు ఆయన వివిధ సందర్భాల్లో చేసిన పుస్తక సమీక్షా ప్రసంగాలు ఎన్న దగినవి. వాటన్నింటిని రాసి ఒక చోట తేగలిగితే మంచి విమర్శనా గ్రంధమవుతుంది.

డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు ఇప్పటివరకు ‘ముగ్గు’ కవితా సంకలనం, ‘వర్తమాన సంధ్య’ కవితా సంకలనం, ‘విశ్వనాథ వెయి పడగలు- ఒక దర్శనం’ (తన పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంధం), ఒక పద్యం నేర్చుకుందాం, ఆది మకుటంతో ‘నీవు’ పద్య కావ్యం, ‘వెర్రి మానవుడు’ ఖలీల్ జిబ్రాన్ రచనకు అనువాదం తదితర అనేక రచనలు వెలువరించారు. అనేక సంచికలకు సంపాదకత్వం వహించారు. ఇటీవలే అష్టావధానం చేయడమూ ఆరంభించారు.

ఇట్లా గత నాలుగు దశాబ్దాలకు పైగా సాహిత్య రంగంలో వున్న గండ్ర లక్ష్మణ రావు గారి ‘ప్రస్తావన’ మంచి పుస్తకంగా మిగిలి పోతుంది.

click me!