దసరా నవరాత్రి సందర్భంగా ప్రముఖ తెలుగు కవి శివశక్తి అనే కవిత రాశారు. ఆ కవితను ఇక్కడ చదవండి.
జన్మకారిణి , జగదాంబా
జన్మలు సదా జీవన్మరణాల సంధ్యల్లో బతుకుతున్నాయి
భయాలు బయల్దేరినట్లు ధైర్యాలు ఉరకడం లేదు
క్షేత్రపాలినీ , అక్షర వాహినీ
జ్నాన స్నానాలు దేహాల గాయాలని మాపడం లేదు !
ప్రకృతి నీ చిటికెలతో నర్తిస్తుంది
అమ్మ బొమ్మలు నీ కళ్ళతో రూపు దిద్దుకుంటున్నాయి
అవ్యక్త ధరణీ తలం నీ పాదాల తాకిడితో పారాడుతుంది
అశేష ఘట్టాల ధ్వంస నాట్యాల ముద్రలు నీ అరచేతులు
అమ్మా ,బతుకమ్మా , పెద్దమ్మ తల్లీ
అహరహరమ్ అమాయక మానవ గణం గుండెలు అదురుతున్నాయి తల్లీ
పైడి లేకపోయినా పీడ మాత్రం
మెడలు వంచి మరణ నాట్యమాడుతుంది
బ్రహ్మ జెముడు మైదానాలగా బతుకు దారులు మారుతున్నాయి
వలస గెంతుల విలాసాలు కూడా
విష తుంపర జల్లుల్లో మునిగి పోతున్నాయి
ఆ నుంచి ఆహ దాకా ఆగణితంగా
కొరడా కొసలు వీపులమీద వాతలవుతున్నాయి
పొలిమేర పొలిమేరకి కొలువైన తల్లీ
పసుపూ కుంకుమ తో రూపు దాల్చే తల్లీ
గడప గడప కి బొట్టువై వెలిగే తల్లీ
వాకిళ్ళ ముగ్గుల్లో ఊరేగే మా అమ్మా
పగటి తెరా, చీకటి తెరా రోజూ తెరవడం తప్ప
ఎండా వానల్లో ఎండుతూ తడుస్తూ ఎదురీదడం తప్ప
పండగల పుట్టిల్లు, మెట్టిల్లు తెలియనివాళ్లం
భీతిల్లిన కన్నీళ్ళ అర్ఘ్యాన్ని ఆర్పిస్తున్నాం తల్లీ
నుదిటికి నేత్రాలని ప్రసాదించగలవని !
***
తల్లీ, పెత్తల్లి, పెద్దమ్మ తల్లీ
మోహ బీజాలు నుదుటి చాలల్లో ఇనప గుళ్ళుగా మారుతున్నాయి !
ఒకదానికి ఇంకొకటి పోలిక లేని నేత్రాల జగత్తులో
జజ్జనికర జనార అంటూ జన నేత్రాల్లో ధైర్య జలాలు నింపు తల్లీ !
-ఒబ్బిని