నక్క హరిక్రిష్ణ కవిత : దీపపుంజం

By telugu team  |  First Published Nov 29, 2021, 12:29 PM IST

నూరు అంచుల దీప పుంజాల వెలుగులను మేడ్చల్ నుండి రాస్తున్న నక్క హరిక్రిష్ణ కవిత 'దీపపుంజం' లో చూడండి.


ఎన్నో ఏళ్లుగా
కాలాన్ని తవ్వుకుంటూ వచ్చాను
కనిపించిన ధ్రువాలే
మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి

ఎన్ని మట్టిదిబ్బలు 
ఎన్నెన్ని మంచుగడ్డలు
గాయానికి మందు రాస్తున్నయి గాని
గమ్యానికి దారినివ్వడంలేదు

Latest Videos

undefined

తవ్విన గతం కుప్పనంతా
తొవ్వ కోసం
చూపు దిక్కు మెట్లుగా పేర్చాను

కాలాన్ని మరింత తొందరగా లాక్కెళ్తున్నయి గాని
ఒక్క దివిటినైనా చేతికివ్వడం లేదు
ఎక్కడో ఏదో లోటు
ఇంతలో రెండు పక్షులు

ఒకటి చీకటిని కప్పుకొని
వెలుగు పనులు చేస్తుంటే
వెలుగు ముసుగు కింద
మరొకటి రాత్రి పనులు చేస్తుంది

అంతలో కొన్ని ముఖాలు
ఒకటి కత్తిమీద ఆడుతుంది
ఇంకొకటి కత్తి చాటున దాక్కుంది
మరొకటి ఆ కత్తినే శాసిస్తుంది
మిగిలిన మరో ముఖం 
కత్తిని మోస్తూ భరిస్తున్నది

కొన్ని అడుగులు ఎక్కాను
అక్కడొక చిన్న దీపం
చుట్టూ పురుగులు
మూడు పొరల అంచెలలో
కాంతికి అడ్డుపడుతున్నయి
మెట్లకు అడ్డంకులవుతున్నయి

అక్కడి దాకా వచ్చిన నన్ను చూసి
ఆ దీపం
ఓ పుంజాన్ని జారవిడిచింది
దానికి నూరు అంచులున్నాయి

click me!