ప్రమాదం ఏ రూపంలోనైనా పొంచి ఉండొచ్చని నక్క హరిక్రిష్ణ రాసిన కవిత ' చిరిగిపోయిన ప్రేమలేఖ ' ఇక్కడ చదవండి :
ఏ హృదయానికి మానని గాయం అయ్యిందో
ఏ కన్న కడుపుకు తీరని శోకం మిగిల్చిందో
చెల్లా చెదురుగా పడిన అక్షరాలు
ఎన్ని కలల సౌదాలను కూలదోసాయో
పట్టాలపై ముక్కలు ముక్కలుగా దొరికిన
భావకాగితపు ఖండికలు
ఏ కుటుంబపు ఆశలను ఆవిరి చేసిందో
కాల సందర్భంలో అందరి ఇళ్లలో వినిపించే ఏడుపే
అయినా ఈ దుఃఖం
ఎప్పటికీ మరపురాని రుధిర వర్షాన్ని కురిపించిపోయింది
దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది
ప్రపంచం విస్తు పోయింది
శవాల ఎర్రటి గుజ్జు
పట్టాల మీద పేరుకుపోయింది
ఎవరికన్ను కాటేసిందో
కాలయముడు మృత్యువిహారం చేశాడు
తలరాతలన్నీ
రైలు పెట్టెల్లో కొట్టుకుపోయాయి
కన్నీరు కరిగించిన నెత్తుటి మరకలకు
ఎన్ని బతుకులకు
తమ బతికిప్పుడు భారమయ్యిందో...
ఎన్ని కుటుంబాలకు
సంతోష జీవితం దూరమయ్యిందో...
చెరిగిపోని మచ్చ
ప్రమాదం ఏ రూపంలోనైనా పొంచి ఉండొచ్చని
అప్రమత్తత నేర్పిన గుణపాఠం