ఎన్.నరేశ్ చారి కవిత : మడతమంచం-నానమ్మ

By telugu team  |  First Published Sep 29, 2021, 2:55 PM IST

నానమ్మ జ్ణాపకాలను రావిరూకల నుండి ఎన్.నరేశ్ చారి రాసిన కవిత " మడతమంచం - నానమ్మ" లో  చదవండి.


మడత మంచంపై 
నానమ్మ కూర్చుంటే
సింహసనంపై మహారాణి కూర్చున్నట్టే !
అదృష్టమంటే మడతమంచానిదే 
దర్పమంటే కూడా మడతమంచానిదే !
బహుశా 
మహారాణిని మోస్తున్నందుకేమో !

నానమ్మను మోయడమంటే
చరిత్రను మోయడమే
నానమ్మను మోయడమంటే
సంస్కృతిని మోయడమే
నానమ్మను మోయడమంటే
జ్ఞాపకాల చెట్టును మోయడమే

Latest Videos

undefined

మంచమంటే మంచంకాదు
మహారాణి ముచ్చట్లన్నీ వినే చెలికత్తె
పెల్లుబుకిన కన్నీటిని తుడిచే పరిచారిక
గత వైభవాన్ని
వర్తమానానికి పరిచయంచేసే చరిత్ర పుస్తకం
మరచిపోతున్న సంప్రదాయాలను
మానవత్వపు విలువలను
కథలు కథలుగా చెప్పే పెదరాసి పెద్దమ్మ

కాలం హారతికర్పూరంలా కరిగింది
బలహీన రాజ్యంపై
బలమైన‌ రాజ్యం దాడిచేసినట్టు
నానమ్మ దేహంపై  వ్యాధులు దాడిచేశాయి
మహారాణిలా వెలిగిన నానమ్మ
వంశ వృక్షంనుండి పండుటాకై రాలిపోయింది
మడతమంచం కూలిపోయింది
అయినా! అది
తీయని జ్ఞాపకమై మదిలో నిలిచిపోయింది.

click me!