సాహిత్య వార్తలు: బంజారాల అస్తిత్వ వ్యక్తీకరణ "ఝోళి"

By Pratap Reddy Kasula  |  First Published Mar 5, 2022, 2:16 PM IST

ఆచార్య సూర్య ధనంజయ్ రాసి సంకలనం చేసి కథా సంకలనం ఝోళిని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఎన్ గోపీ ఆఫిష్కరించారు. సూర్య ధనంజయ్ కథల్లో బంజారా అస్తిత్వం వ్యక్తమైందని గోపి అన్నారు.


సూర్యా ధనంజయ్ ఎంతో ప్రేమతో ఈ కథలను రాసారని, ఆమె బంజారాల అస్తిత్వాన్ని తన కథల్లో ప్రతిబింబిచారన్నారు డా.ఎన్. గోపి.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఉజ్వల్ క్రియేషన్స్, హైదరాబాద్ సంయుక్తాధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు, డా. సూర్యా ధనంజయ్ రచించిన కథా సంపుటి "ఝోళి" గ్రంథావిష్కరణ రవీంద్ర భారతి, సమావేశ మందిరంలో నిన్న ఘనంగా జరిగింది.   ఆచార్య ఎన్. గోపి అధ్యక్షతన జరిగిన  ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు  బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విశిష్ట అతిథిగా విచ్చేయగా, ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, డా. సీతారాం గ్రంథ సమాలోచనం చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గౌరవ అతిథిగా,  ప్రముఖ కవయిత్రి డా. తిరునగరి దేవకీదేవి,  ప్రముఖ కవి, విమర్శకులు డా. ఎస్. రఘు ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు.  ఉజ్వల్ క్రియేషన్స్ గౌరవ కార్యదర్శి డా. ఎం. ధనంజయ్ నాయక్, ప్రముఖ కవి డా. పోరెడ్డి రంగయ్య సమన్వయంలో గ్రంథావిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరిగింది.

విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ ఆచార్య సూర్యాధనంజయ్  జీవితం నేటి సమాజానికి ఆదర్శమన్నారు.  వారు రాసిన  కథా సంపుటి బంజారా జీవితాలను అవిష్కరించిందన్నారు.  తెలుగుశాఖను ఎంతో అనుభవంతో నడిపిన ఘనత ఆమెదన్నారు. పాఠాలు చెబుతూనే తనదైన శైలిలో సాహిత్యాన్ని సృష్టించి సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారన్నారు.

Latest Videos

ప్రముఖ రచయిత్రి డా.దేవకీదేవి కథా ప్రపంచంలో ఈ గ్రంథం ఒక కొత్త కోణం అన్నారు.  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మాట్లాడుతూ తెలంగాణ బంజారాల అస్తిత్వ వ్యక్తీకరణ ఈ కథా సంపుటి అన్నారు.
గ్రంథాన్ని సమీక్ష చేస్తూ డా. సీతారాం “ఝోళి” గ్రంథంలోని కథలను చదివితే తండా బిడ్డల వ్యథలు పరిచయం అవుతాయన్నారు.  ఆత్మీయ అతిథి డా.ఎస్. రఘు బంజారాల బతుకు చిత్రాలకు రచయిత్రి అద్దం పట్టారన్నారు. 
 
ఈ కార్యక్రమానికి డా.పోరెడ్డి రంగయ్య స్వాగత వచనాలు పలికారు. ఉజ్వల్ క్రియేషన్స్ కార్యదర్శి డా.ఎం. ధనంజయ్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన తెలుగు శాఖ పరిశోధక విద్యార్థులను అకడమిక్ కన్సల్టెంట్లను అతిథులు సత్కరించారు. డా. మంత్రి శ్రీనివాస్ ముగింపు వచనాలతో ఈ కార్యక్రమం ముగిసింది.

సుజనప్రియ మాస పత్రిక ఆధ్వర్యంలో   కథ/కవితలపోటీ

సృజన ప్రియ మాసపత్రిక రజతోత్సవం సందర్భంగా కథ, కవితల పోటీలు నిర్వహిస్తున్నారు.  వర్తమాన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఇతివృత్తంతో కూడిన కథ/కవితలను డి.టి.పి చేసి మార్చి 15లోగా  కొమ్మవరపు విల్సన్ రావు, ఇంటి నెంబర్ 5-2-396/ఎస్.ఎస్./పి.42, జక్కిడి రాంరెడ్డి కాలనీ,  సాహెబ్ నగర్ కలాన్, వనస్థలిపురం, హైదరాబాద్ - 500 070, ఫోన్ : 8985435515 కు పంపాలి.  కథ/కవిత ఎక్కడ ప్రచురించనిదై   మూడు కాపీలు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్/ డిటిడిసి కొరియర్ లో పంపిన రచనలే పోటీకి పరిశీలింప బడతాయి.  కథకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు.  ప్రత్యేక బహుమతులు అయిదు ఒక్కొక్కటి వెయ్యి.   కవితకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.3 వేలు, 2వేలు, ఒక వెయ్యి. ప్రత్యేక బహుమతులు అయిదు ఒక్కొక్కటి రూ.500/-.

డా.బూదాటి "ఆనంద కందళిని" వరించిన సహృదయ సాహితీ పురస్కారం-2020

వరంగల్లు  లోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 1996 నుండి ప్రతి సంవత్సరం సుప్రసిద్ధ సాహితీమూర్తులు కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా “ సహృదయ సాహితీ పురస్కారాన్ని” అందిస్తున్నది. నవల , కథ , వచనకవిత , పద్యకవిత , సాహిత్య విమర్శ  విభాగాలలో ప్రతిసంవత్సరం ఒద్దిరాజు వేణుగోపాలరావు  సౌజన్యంతో  రూ.10,000  నగదుతో పాటు అందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం 2020 సంవత్సరానికి  డా.బూదాటి వేంకటేశ్వర్లు రచించిన ఆనంద కందళి సాహితీ విమర్ష గ్రంథానికి  లభించింది. త్వరలో నిర్వహించే సంస్థ రజతోత్సవంలో ఈ పురస్కారంతో రచయితను సత్కరిస్తామని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు గన్నమరాజు గిరిజామనోహరబాబు,  డా.ఎన్.వి.ఎన్.చారి తెలిపారు.

అంతర్జాల పత్రిక  ఆధ్వర్యంలో తోట మునస్వామి రెడ్డి స్మారక ఉగాది కథల పోటీ :

అంశం ఏదైనప్పటికీ కథ నిడివి మూడు పేజీలకు మించకుండా మార్చి 10, 2022 లోపు పంపాలి.  పోటీ గడువు పొడిగించేందుకు కానీ అర్హమైన కథలు రాకపోతే బహుమతుల్లో మార్పులు చేర్పులు చేసే వీలు తెలుగు సొగసు యాజమాన్యానికి ఉంటుంది. కథ ఎంపిక విషయంలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు, వాదోపవాదాలకు తావు లేదు. కథల సాఫ్ట్ ఫైల్స్ (యూనీకోడ్లో) telugusogasu.poteelu@gmail.com కు గాని పంపాలి.
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా  రూ.1200/- ,800/ -, 500/- . ప్రత్యేక బహుమతులు  8 .ఒక్కో కథకు రూ. 300/-.

click me!