నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లిన ప్రభుత్వాన్ని యువకవి మునిశేఖర్.కె ఏవిధంగా ప్రశ్నిస్తున్నారో 'కొత్తేమీ కాదు' కవితలో చదవండి.
త్వరలో యాభైవేల ఉద్యోగాలు
భర్తీ అనంగనే సచ్చినపాణం
లేసొచ్చినట్లయి
ఆగబేగ పట్నం పైనమైనం
ఇదిగో నోటిఫికేషన్
అదిగో నోటిఫికేషన్ అనంగనే
కన్నవారిని కళ్ళల్లో పెట్టుకునే
రోజులొచ్చెనని
తెగసంబురపడ్డాం
ఖాళీల లెక్క తేల్చండని
అధికారులకు ఆదేశాలొస్తే
తప్పిన మా జీవితపు లెక్కను
సరిచేసుకోవచ్చనుకున్నం
కాలంపెట్టే పరీక్షల్లో తప్పిపోవడం,
ఎన్నికలప్పుడే కురిసే ఉత్తుత్తి వరాలజల్లులకు
తడిసిపోవడం మాకు
కొత్తేమీ కాదు.
గాలి వాగ్దానాలకు ఉబ్బిపోయీ...
కొన్నాళ్ళకు గాలొదిలిన బెలూన్ అవ్వడం
మాకు అలవాటే.... కానీ,
చిన్నఆశ
మా ఆశలు, ఆశయాలు సర్కారు
పక్షపాతపు కొక్కానికి
వేలాడుతుంటే చూసి
కనబడని కన్నీళ్ళ మూటలు మోస్తున్న
బతుకులు మావి
పోయినంత దూరం తలూపడానికి
మీ పెరట్లో పాలేరులం కాదు !
రేపటి మీ ఉనికిని ప్రశ్నించే నిరుద్యోగులం.