సాహితీ వనంలో వికసించిన గోపగాని ‘శతారం ’

By Siva Kodati  |  First Published Apr 12, 2022, 9:41 PM IST

ఆదివాసుల జీవితాన్ని తన రచనల్లో విస్తృతంగా రాశారు గోపగాని. కవిత్వ విమర్శనా వ్యాసాల సంపుటి ' శతారం ' లో  ఆదిలాబాద్ జిల్లా వచన కవిత్వం, సాహితీ సంస్థల‌ కృషి గూర్చి వివరించారు.  ప్రముఖ కవిగా, రచయితగా, పుస్తక సమీక్షలుగా, పరిశోధకులుగా, సాహితీ విమర్శకులుగా గోపగాని రవీందర్ సుపరిచితులు


శతారం కవిత్వ విమర్శనా వ్యాసాలు

రచన: గోపగాని రవీందర్

Latest Videos

 

అందమైన జిల్లా, గిరిజనుల ఖిల్లా, ఆదిలాబాదు జిల్లా. మదిని మంత్రముగ్ధం చేసే అడవి అందాలు, ప్రకృతి రమణీయమైన  సౌందర్య దృశ్యాలు, జలపాతాలు, గలగల పారే సెలయేరులతో చూపరులను కట్టిపడేస్తున్న  జిల్లా.  ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా ఉంటూనే  తెలుగు  సాహితీ రంగంలో  అవిశ్రాంత సాహితీ ప్రస్థానం చేస్తున్నారు గోపగాని రవీందర్. ఆదివాసీ గిరిజనులలో  చైతన్యం విద్య ద్వారా మాత్రమే  వస్తుందని భావించే వారిలో మొదటి వ్యక్తి గోపగాని. ఆదివాసుల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు, ఇప్పటికీ కూడా సాహితీ సృజన కారులు  రాయాల్సినంతగా రాయలేదని, విభిన్నమైన సంస్కృతులతో  జీవనయానం చేస్తున్న గిరిజనుల సమగ్ర జీవితాన్ని ప్రతిబింబించే కథా సాహిత్యం చాలా తక్కువేనని అంటారు.  ఆదివాసుల జీవితాన్ని తన రచనల్లో విస్తృతంగా రాశారు గోపగాని. కవిత్వ విమర్శనా వ్యాసాల సంపుటి ' శతారం ' లో  ఆదిలాబాద్ జిల్లా వచన కవిత్వం, సాహితీ సంస్థల‌ కృషి గూర్చి వివరించారు.  ఉట్నూర్ సాహితీ వేదిక నుండి వెలువరించిన ఉట్నూరు కవిత, ఉట్నూరు సాహితీ కెరటాలు, ఉట్నూరు సాహితీ సంచికలో  13‌వ‌ శతాబ్దికి చెందిన గోండు రాజుల కోటను  ముఖచిత్రం పెట్టి వెలుగులోకి తెచ్చారు.

ప్రముఖ కవిగా, రచయితగా, పుస్తక సమీక్షలుగా, పరిశోధకులుగా, సాహితీ విమర్శకులుగా గోపగాని రవీందర్ సుపరిచితులు.  ఆయన వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని తిమ్మాపురం (హవేలి) గ్రామంలో  గోపగాని  రాములు, శాంతమ్మలకు 1971 జూన్ 13న జన్మించారు.  ప్రాథమిక ‌విద్య స్వంత గ్రామంలో  పూర్తి చేసి,  ఉన్నత విద్య  తన గ్రామ సమీపంలోని ఎపిఎస్పి నాల్గవ బెటాలియన్  పోలీసు క్యాంపులోని  మామునూరు  ఉన్నత పాఠశాలలో  అభ్యసించారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ , డిగ్రీ పూర్తి చేసి కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా  తెలుగు సాహిత్యంలో ‌ఎం.ఏ. పట్టభద్రులై  సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారి 'నేలమ్మ నేలమ్మ గేయ రూప కవిత్వం' పై  పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి యం.ఫిల్  పట్టాను అందుకున్నారు.

ఉద్యోగ రీత్యా తెలుగు భాష ఉపాధ్యాయుడైన గోపగాని  ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉట్నూర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  పెర్కగూడ  యందు విధులు నిర్వహించారు. తెలుగు సాహిత్యం పట్ల ఎనలేని ప్రేమతో  జనవరి 2013లో ఉట్నూర్ యందు సాహితీ వేదికను ఏర్పాటు చేసి, ఏజెన్సీ ప్రాంతంలో సాహితీ చైతన్యాన్ని తీసుకురావడంలో తన వంతు పాత్రను పోషించారు.  అంకురంతో మొదలైన తన తొలి రచన  చిగురు చెరగని సంతకం, దూరమెంతైన  కవితా సంపుటాలతో పాటు సినీ గేయ రచయిత  సుద్దాల అశోక్ తేజ గేయాలపై   'నేలమ్మ నేలమ్మ గేయ రూప కవిత్వం - పరిశీలన'  తెలంగాణ కథకుల కథాంతరంగం , కవిత్వ విమర్శనా వ్యాసాల సంపుటి శతారం మొదలగు సంకలనాలు వెలువరించడం ఆయన సాహిత్యంలో చేస్తున్న  కృషికి నిదర్శనాలు అని భావించ వచ్చు.

' శతారం ' వ్యాస సంపుటిలో  75 వ్యాసాలున్నాయి. ఆదిలాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన వ్యాసాలు, వచన కవిత జాతీయ సదస్సులో చదివిన వ్యాసాలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.  కాళోజీ నా గొడవ - కవులకు దిక్సూచితో ప్రారంభమైన  వ్యాసం  తెలంగాణలోని  నిరంకుశత్వ నిజాం పాలనను ఎదిరించి నిలిచిన ధీశాలి, పర ప్రభుత్వాన్ని తన కవితలతోనే కాదు  మాటలతో సైతం వణికించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని విడమరిచి చెప్పారు. చిరస్మరణీయమైన సినారె "మట్టి  మనిషి ఆకాశం"  కవితలో  మట్టిని స్థలానికి, ఆకాశాన్ని కాలానికి, ప్రతీకలుగా తీసుకోని, స్థలానికి కాలానికి మధ్య మనిషి సాగిస్తున్న జీవన సమర ప్రవాహాన్ని చిత్రీకరించటం దీర్ఘకావ్యం విశిష్టత అని సినారె కలం రాల్చిన బహుపసందైన పదాల కూర్పుతో అక్షరాల రమ్యతతో సౌందర్యంగా అలంకరించబడిన కవిత చిరస్మరణీయమైనది అని తెలియజేశారు.  విలక్షణమైన కవిత్వం రాసే కవి దాశరథి కృష్ణమాచార్యులు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదంతో తెలంగాణలోని ప్రజల జీవితాల్లో సుఖదుఃఖాలు, పేదరికం, తెలంగాణలో జరిగిన ‌ప్రత్యేక ఉద్యమాలు కవులకు, రచయితలకు  అనేక విధాలుగా ప్రభావితం చేశాయి అని గుర్తుచేశారు.

' తెలంగాణోద్యమ నెగడు కొర్రాయి'  వ్యాసంలో  గుండె ధైర్యానిచ్చేది కవిత్వమని, సమరోత్సాహాన్నిచ్చేదొక కవిత్వమనే దృఢమైన భావాలున్న డాక్టర్ దామెర రాములు  కవితలు అని ఇంద్రవెల్లిలో  అడవి బిడ్డల త్యాగాలు, దోపిడీ, తిరుగుబాటు,  న్యాయం కోసం పోరాటం  సంఘటనల గుర్తు చేస్తూ  'నెత్తుటి వెన్నెల '  తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను వ్యక్తం చేస్తూ జరుగుతున్న ఉద్యమ సందర్భంలో జయహే తెలంగాణ , కొర్రాయి  కవితలు మన మధ్యకు వచ్చాయి అని చెప్పారు.  అంతరంగ జ్వలనాకృతి చెమన్ కవిత, పడిలేస్తున్న కెరటం జూకంటి కవిత్వం, శీలా వీర్రాజు కవిత ఎర్రడబ్బా రైలు, మూలాలను మరవని కవి యాకూబ్ కవితలు, తెలంగాణ కవితకు సొగసులద్దిన మట్టివాసనల కవి అన్నవరం దేవేందర్   ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని విస్తరించిన అందమైన అడవి గోదావరికి అటుఇటుగా ఉన్న ఆదివాసుల పోరు జీవితాన్ని అడవి కవితలో చర్చించారు.   ‌హిందీ చలన చిత్రాల్లో  ప్రసిద్ధ గేయ రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందిన గుల్జార్, దేశ విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆ తర్వాత ముంబాయిలో స్థిరపడి హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో రచనలు చేసి సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నారని ప్రస్తావించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వాడ్రేవు చిన వీరభద్రుడు , శివారెడ్డి, ఎన్ గోపి, శీలా‌వీర్రాజు, డాక్టర్ ఎస్వీ,  జూలూరి, వి.ఆర్.విద్యార్థి, కుందుర్తి గూఢచారి, హనుమంతు, అలిశెట్టి ప్రభాకర్, అనిశెట్టి రజిత, జనం గుండె డప్పులు సుద్దాల గీతాలు, ప్రజా ఉద్యమాలకు తన పాటలతో ఉత్తేజమిచ్చిన  ప్రజా గాయకుడు గూడ అంజయ్య , మొదలగు సాహితీకారులను విశ్లేషణ చేసారు.

తెలంగాణ రచయితల వేదికకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా  సేవలు అందిస్తున్న గోపగాని, ఉట్నూరులో ఉట్నూరు సాహితీ వేదిక, లక్షెటి పేటలో సాహితీ స్రవంతి సంస్థలు ఏర్పాటు చేశారు. అతని  సాహితీ సేద్యానికి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పురస్కారాలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం,‌ తెలుగు భాషా తేజోమూర్తి పురస్కారం కూడా లభించింది.  తెలంగాణ రచయితల వేదిక ఆదిలాబాద్ జిల్లా శాఖకు పది వసంతాలు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు  నిర్వహిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో సాహితీ వికాసం కోసం, పలు గిరిజన  గ్రామాలలో, వసతిగృహాల్లో, పాఠశాల, కళాశాలలో కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో  సాహితీ చైతన్యానికి గోపగాని చేస్తున్న కృషి అభినందనీయం. శతారం పుస్తకాన్ని  ఉట్నూరు సాహితీ వేదిక గౌరవ అధ్యక్షులు రాథోడ్ భీమ్ రావు గారికి, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి  డా.మెస్రం మనోహర్ గారికి సుమనస్సులతో   అంకితం చేయడం ప్రశంసనీయం.
 
(వెల: ₹= 260/-  ‌ప్రతులకు గోపగాని రమణశ్రీ, ఇంటి నెం 6-41/1A అంకితివాడ , లక్షెటిపేట,  మంచిర్యాల జిల్లా - 504215)
 

click me!