మల్యాల మనోహర రావు కవిత : పామరులు

By Pratap Reddy Kasula  |  First Published Feb 17, 2022, 3:56 PM IST

మేడారం జాతర నేపధ్యంలో అడవి బిడ్డలపై హన్మకొండ నుండి  మల్యాల మనోహర రావు రాసిన కవిత  "పామరులు " ఇక్కడ చదవండి.


వాళ్ళు
అరమరికలులేనోళ్ళు
అహర్నిశలు
 చెమటోడ్చెటోళ్లు 
ఏమొచ్చినా ఏదొచ్చినా
చెట్టును పుట్టను
రాయిని రప్పను
నీటిని నిప్పును
మొక్కేటోళ్ళు
కర్మ యోగులు.

అది గుడినా మసీదా
దర్గానా చర్చా..
అతడు గురువా
స్వామీజా..
ఫాస్టరా ఫకీరా
యోగినా బాబానా
ఏదైతేం ఎవ్వరైతేం
మతం మర్మం
తెలియనోళ్లు 
అరమరికలులేనోళ్ళు
భక్తితో.. 
సాగిలపడేటోళ్ళు
తామరాకు మీద
నీటి చుక్కలు.

Latest Videos

అంతటా అందరిలో
దేవుణ్ణి చూసేటోళ్లు
ఏ దేవులాట లేనోళ్ళు
పండితులు
కానివాళ్ళు
ప్రవక్తలెవరో ఎరుగరు

యజ్ఞ గుండంలో
మండే ఎండుపుల్లలు
అన్ని మతాలవాళ్లకు
ఆది పురుషులు 
కాల దోషాలకు
అతీతులు, వాళ్లే..
మౌలిక వేదాంతులు.

వాళ్లే..
పామరులు 
మనుషుల్లో మానవులు..

click me!