చట్టాలే ఆయుధంగా పోరాడిన సాహితీ ప్రేమికుడు నరెడ్ల శ్రీనివాస్ స్మృతిలో డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత "ప్రశ్నించిన సంతకం చెరిగింది" ఇక్కడ చదవండి.
కరీంనగర్ చైతన్య సేతువు
భూమిలో ఇంకిపోయిందీ
ఉద్యమ కెరటం వెళ్ళిపోయింది
నింగి మెరిసే తారగా
సామాన్యుని గొంతులో "ప్రశ్న" నింపిన స్వేఛ్ఛాపథం ఆగింది
మనిషి మనిషిని ఏకంచేసిన
మంచి మనిషి కనుమరుగైన
ప్రశ్నించిన సంతకం చెరిగింది
రెక్కల పక్షి ఎగిరిపోయింది
విరిగిన రెక్కల నేలకు ఒరిగింది
స్వేచ్ఛా ఊపిరి చెదిరింది
భావస్వేచ్ఛా ప్రతీక మనకు విడిచి
అనిర్వచనీయ వ్యక్తిత్వ కిరణమది
చీకటి గుహను చీల్చిన చరిత్ర
బహూశా పోరాడిన నేలపై జారింది
వెలుగై నిండింది ఈ ధాత్రిలో
సేవానిరతి దారిలో అన్నీ మరిచి
జ్ఞాన ధుని మాటలో కరిగే శిలలే
మైత్రీవనిలో ధైర్యం విసిరిన శిల్పిగా
మనలో మనతో మౌనంగా నిలిచె
జ్ఞాపకాలను నెమరువేసుకుంటే
మనిషిలోని మనసంతా మనతోనే
జీవించెను ఒక అక్షరమాలగా
విశ్రమించని ఓ సేవా కార్యశాలగా...