సాహిత్య వార్తలు: పాలపిట్ట కథల పోటి, గాజు కాగితం ఆవిష్కరణ, ఇంకా...

By telugu team  |  First Published Sep 18, 2021, 2:36 PM IST

తెలుగువారి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ సందర్భంగా దీనిని ఒక సాహిత్య ఉత్సవంగా మలచాలన్న సంకల్పంతో పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత  సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథలపోటీని నిర్వహించాలని పాలపిట్ట సంపాదకవర్గం నిర్ణయించింది. 


తెలుగువారి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ సందర్భంగా దీనిని ఒక సాహిత్య ఉత్సవంగా మలచాలన్న సంకల్పంతో పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత  సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథలపోటీని నిర్వహించాలని పాలపిట్ట సంపాదకవర్గం నిర్ణయించింది. మంచి కథలని ప్రోత్సహించే లక్ష్యంతో తలపెట్టిన ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులని ఆహ్వానిస్తున్నాం.
బహుమతులు
మొదటి బహుమతిః రూ. 10,000/-
రెండో బహుమతిః రూ. 6,000/
మూడో బహుమతిః రూ. 4,000/-
పది ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1,000/-
 
 నిబంధనలు
_ ఇతివృత్తం ఆయా రచయితల, రచయిత్రుల ఇష్టం. జీవితం విశాలమైంది. మానవ జీవితం అనేక అనుభవాల సమాహారం. కనుక ఎలాంటి ఇతివృత్తం ఎంచుకోవాలో కథకుల నిర్ణయానికి వదిలేస్తున్నాం. తీసుకున్న వస్తువును కథగా మలచడంలో చూపిన ప్రతిభకే ప్రాధాన్యం.
-  ఏం చెప్పారన్నదే కాక ఎలా చెప్పారన్నదే ఈ పోటీలో ప్రముఖంగా పరిగణనలోకి తీసుకునే అంశం. ఇతివృత్తాన్ని ఎంత అందంగా, పఠిత మనసుని ఆకట్టుకునేలా చెప్పారన్నదే ముఖ్యం.
- పోటీకి పంపించే  కథలకు ఎలాంటి పేజీల పరిమితి లేదు. కథ రాయాలనుకునే వారికి ఇన్నిపేజీలలోనే రాయాలని నిబంధన విధించడం సరి కాదని పాలపిట్ట భావిస్తున్నది.  తాము చెప్పదలచుకున్న కథని ఒక పేజీలో చెబుతారా ఇరవై, ముప్పయి లేదా అంతకన్నామించిన పేజీలలో చెబుతారా అనేది కథకుల సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అందుకే ఈ కథలపోటీలో పాల్గొనే కథకులకు ఎలాంటి పరిధులు, పరిమితులు లేవు.
- పోటీకి పంపించే కథలు సొంత కథలయి ఉండాలి. అనువాదాలు కాదు. అలాగే ఇదివరలో ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాకూడదు. సోషల్‌ మీడియాలోగానీ, ఇతర వెబ్‌సైట్లలో గానీ ప్రచురితమై ఉండరాదు. ఈమేరకు కథతోపాటు హామీపత్రం పంపించాలి.

మీ కథలు చేరడానికి చివరితేదీ - 15 అక్టోబర్‌ 2021
మీ కథలని పోస్టు చేయవచ్చు లేదా మెయిల్‌లోనూ పంపవచ్చు.
చిరునామాః ఎడిటర్‌, పాలపిట్ట
ఎఫ్‌-2, బ్లాక్‌ -6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044
ఫోనుః 9490099327
Email: palapittamag@gmail.com

Latest Videos

"గాజు కాగితం" పుస్తకావిష్కరణ

 మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పాలమూరు సాహితి కార్యాలయంలో పాలమూరు యువకవి జోగి నరేష్ కుమార్ రచించిన ''గాజు కాగితం" కవితా సంపుటిని సోమవారంఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఉధృతంగా కవిత్వం పారుతున్నదని, అలా జోగి నరేష్ కుమార్ కవిత్వాన్ని నిరంతరం పారిస్తున్నాడన్నారు. తన తొలి కవితాసంపుటితోనే కవి గాఢమైన కవిత్వాన్ని రచిస్తూ పాఠకులను ఆకట్టుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ పాలమూరులో వచనకవిత్వం విస్తృతంగా వస్తున్నదన్నారు. అలాంటి వచనకవిత్వాన్ని నరేష్ కుమార్ చక్కగా రాస్తున్నాడని ప్రశంసించారు. సభాధ్యక్షులు కె.లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు యువకవులు మంచి కవిత్వాన్ని రాస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యువకవుల వేదిక అధ్యక్షులు బోల యాదయ్య, ప్రధాన కార్యదర్శి కె.పి.లక్ష్మీనరసింహ, పొన్నగంటి ప్రభాకర్, చిత్రకారుడు మహేష్ జి తదితరులు పాల్గొన్నారు.

వీక్షణం సాహితీ గవాక్షం- నవమ వార్షికోత్సవం

కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021 న ఆన్లైనులో జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా||కె.గీత  మాట్లాడుతూ తొమ్మిదేళ్ల  క్రితం ఒక చిన్న సమావేశంగా మొదలయ్యి ఇంతలోనే 9 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉందని అంటూ, ఉన్నతమైన లక్ష్యాలతో తమలో సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ, స్వచ్ఛంద వేదికగా సమావేశాల్ని జరపుకుంటూ వస్తున్న  తనకు తోడ్పడుతున్న వీక్షణం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. 

వీక్షణం సభ్యులందరికీ వీక్షణమంటే కుటుంబం తర్వాత అతి ప్రధానంగా మారిన సాహితీ కుటుంబమని అన్నారు. పక్కా కార్యాచరణతో సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా, ఆసక్తి కోల్పోకుండా నడపడం వెనక ఎడతెగని శ్రమ ఉన్నా అది చక్కని ఆనందాన్నిచ్చే శ్రమ అని,  గొప్ప బాధ్యత ఉన్నా అత్యంత ఆత్మీయమైన బాధ్యత అని అన్నారు. తర్వాత కిరణ్ ప్రభ గారు మాట్లాడుతూ వీక్షణం ఎప్పటికీ ఇలాగే ఒక ఆత్మీయ వేదికగా కొనసాగుతుందని, నిరంతర విజయానికి తోడ్పడుతున్న  మిత్రులందరికీ పేరుపేరునా అభివందనాలు తెలియజేసారు.  ఆ తరవాత వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ  కిరణ్ ప్రభ, కాంతి కిరణ్  గార్ల  చేతుల మీదుగా జరిగింది. వీక్షణం ప్రత్యేక సంచికల పరిచయం వేణు ఆసూరి గారు చేశారు. 

తర్వాత సుభాష్ పెద్దు   “ఆమె ఎవరు?” అంటూ రవివర్మ చిత్రాలకు ప్రేరణగా నిలిచిన యువతుల గురించి ప్రసంగించగా,  శ్రీచరణ్ పాలడుగు   “కిరాతార్జునీయం” గురించి సోదాహరణంగా సంగ్రహ ప్రసంగం చేసారు. మంజుల జొన్నలగడ్డ  “తెలుగు కళాత్మక సినిమా కథల” గురించి, వేమూరి వేంకటేశ్వరరావు “అమెరికా ఆంధ్రులు తెలుగు తల్లికి చేసిన సేవ” గురించి, మధు ప్రఖ్యా యండమూరి నవలలు కలిగించిన  స్ఫూర్తి  గురించి ప్రసంగించారు.

చం.స్పందన పురస్కార సభ

రైతుల గురించి, స్త్రీల గురించి, విద్యార్థుల గురించి, రజకుల శ్రమ గురించి, సైనికుడి భార్య అంతరంగం గురించి జీవన వాస్తవికతను అంటిపెట్టుకుని కదిలించే కవితలతో కూడిన పక్కి రవీంద్రనాథ్ తొలి కవితా సంపుటి "పక్షితనాన్ని కలగంటూ..." కావ్యానికి చం.స్పందన 2019 ఆత్మీయ సాహితీ పురస్కారం లభించింది. ఈయన ఉత్తరాంధ్ర-పార్వతీపురముకు చెందినకవి.

ఈ పురస్కార ప్రదాన సభ  ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం అనంతపురములోని స్థానిక ఎన్.జి.ఒ. హోమ్ లో  'స్పందన ' అనంతకవులవేదిక ఆధ్వర్యంలో జరుగుతుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి వి.చంద్రశేఖరశాస్త్రి ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ సభలో అవార్డు గ్రహీత పక్కి రవీంద్రనాథ్ కు జ్ఞాపిక, నగదు బహుమతి తో పాటుగా కవిసత్కారం జరుగుతుంది. రాజారామ్ అధ్యక్షతన జరిగే చం.స్పందన పురస్కార సభలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముఖ్య   అతిథిగా పాల్గొంటారు.  ప్రముఖ కవి రాధేయ కావ్య సమీక్ష చేస్తారు. పురస్కార ప్రదాత "ఒక కత్తుల వంతెన" కవి చం. ఈ పురస్కారాన్ని  పక్కి రవీద్రనాథ్  కు అందజేస్తారని  'స్పందన ' అనంత కవుల వేదిక  ప్రధాన కార్యదర్శి  వి.చంద్రశేఖరశాస్త్రి తెలియజేశారు.

రామారావు స్మారక సరస కథల పోటీ

మీ కథలను, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు, యూనికోడ్ లో పేరాల మధ్య గ్యాప్ తగినంతగా ఇస్తూ  telugusogasu.poteelu@gmail.com మెయిల్ అడ్రస్ కి పంపగలరు.
బహుమతులు:
మొదటి బహుమతి : రూ: 1,200/-
రెండవ బహుమతి : రూ: 800/-
మూడవ బహుమతి: రూ:500/-
ప్రత్యేక బహుమతులు (8) : ఒక్కింటికి రూ: 300/- చొప్పున. 

రచనల ఎంపిక విషయంలో తెలుగు సొగసు సంపాదక వర్గానిదే తుది నిర్ణయం. వాద, ప్రతివాదాలకు తావు లేదు. హామీ పత్రంతో మీ కథలు చేరవలసిన చివరి తేదీ : 30.10.2021.
 

click me!