కన్నీటిలో ముంచి తీసిన అక్షరాలను మెర్సీ మార్గరెట్ కవిత 'వాంగ్మూలం' లో చదవండి.
రాస్తూ రాస్తూ ఏదో మర్చిపోయాను
చూపుల కొసకు చిక్కుకున్న కన్నీటి సిరాని ఒలికించి
నన్ను నీలిమయం చేసిన క్షణాలని
ఏ కాగితం మీద పరిచి నేను ఆవిరైపోను
ఏడుస్తూ ఏడుస్తూ ఎక్కడో తప్పిపోయాను
నీ జుట్టుకు రాసుకున్న సంపెంగి తైలంకోసం
అడవుల్లోకి వెతుకుతూ వెళ్లి వృక్షమై అక్కడే
నువ్ వచ్చి వాలుతావని నిరీక్షిస్తూ నిల్చున్నాను
undefined
కరిగిపోతూ కరిగుపోతూ మాయమవుతాను
రాలిపోయిన ఆకులమీద శ్వాస పీల్చుకునే మట్టి అణువుల తీరు
బంగారువర్ణపు గాజు దేహమ్మీద ఆవిరిచుక్కలా నేల జారుతూ
నిలబడ్డాను
కూలబడ్డాను
రాలిపడ్డాను
చీకటి బరువు నన్ను నేలలోకి పూడుస్తుంటే
ఒక్క మాటకోసం
నేను బతికున్నానన్న
ఒక్క మాటకోసం
శ్వాసతో యుద్ధం చేస్తూనే ఉన్నాను
నేను
నరకబడ్డాను
నలపబడ్డాను
తునాతునకలు గావింపబడ్డాను
మండుతున్నాను
కణకణం కాల్చబడి బూడిదైనాను
అనువణును భూమిలో పాతేసుకున్నాను
కన్నీటి జలలోంచి
పుట్టుకొచ్చాను
ప్రవహించాను
పులకించాను
పునీతనైయ్యాను
నేను నిల్చున్నాను
నన్ను నేను మోస్తూ
ఆకాశానికి ధూళి రేణువుల్లా నా దేహాన్ని ఆహారంగా పెడుతూ
నేను లేచాను
నిల్చున్నాను
నిలబడ్డాను
వినబడ్డాను
కనబడ్డాను
పిలవబడ్డాను
బ్రతికొచ్చాను
శ్వాసిస్తూ శ్వాసిస్తూ
రాస్తూ రాస్తూ
నడుస్తూ నడుస్తూ
కవితనైయ్యాను
కన్నీటిలో ముంచి తీసిన
అక్షరమైయ్యాను.