బిల్ల మహేందర్ కవిత: ఒకటి ఎప్పుడూ ఒంటరే!!

By telugu team  |  First Published Oct 9, 2019, 11:51 AM IST

కొండల్ని దిగుతూ గుట్టల్ని దాటుతూయ/ చెట్లు పుట్టల వెంట రాళ్ళు రప్పల్ని కలుపుకొంటూ/ వంకలు వంకలుగ పాయలు పాయలుగ/ చీలిపోతూ కలిసి పోతూ పాల నురగై దుంకిపోతూ/ ప్రవహిస్తూనే ఉంటది అంటున్నాడు కవి బిల్ల మహేందర్.


నువ్వొక
నదిని కలగను

కొండల్ని దిగుతూ గుట్టల్ని దాటుతూ
చెట్లు పుట్టల వెంట రాళ్ళు రప్పల్ని కలుపుకొంటూ
వంకలు వంకలుగ పాయలు పాయలుగ 
చీలిపోతూ కలిసి పోతూ పాల నురగై దుంకిపోతూ
ప్రవహిస్తూనే ఉంటది

Latest Videos

undefined

చూడడానికి
అది కదిలిపోతున్న ప్రవాహమే కావచ్చు
లోలోన ఎంత ప్రపంచమున్నది?
ఎన్ని బతుకుల్ని దాచుకుంది?
ఎన్ని జీవాలకు ఊపిరై నిలుస్తున్నది??

ఒక్కో జీవిది 
ఒక్కో రూపం ఒక్కో ఆకారం
ఒక్కో జీవిది 
ఒక్కో దేహం ఒక్కో భాష..

చెప్పు
ఏ దేహాన్ని విసిరేస్తావు??
ఏ గొంతును కోస్తావు??

*

నువ్వొక
విత్తును కలగను

మొలకెత్తుతది చిగుర్లు తొడుగతది
కొమ్మలేస్తది ఆకులేస్తది
మొగ్గ తొడుగుతది పూలు పూస్తది
కాయలు కాస్తది మహా వృక్షమవుతది

పక్షులకు గూడవుతది
జంతువులకు తావవుతది
మనుషులకు నీడవుతది
నిలువునా కూల్చేసినా
నలుగురికి ఉపయోగపడుతది

ఒక్కో చిగురుకు
ఒక్కో బంధం
ఒక్కో కొమ్మకు
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో ఆకుకు 
ఒక్కో భాష..

చెప్పు
ఏ కొమ్మను నరుకుతవు?
ఏ ఆకును తెంపుతవు??

*

నువ్వొక
ఆకాశాన్ని కలగను

నలుపవుతది 
తెలుపవుతది
మబ్బులొస్తయి 
మేఘాలు కురుస్తయి
చంద్రుడొస్తడు సూర్యుడొస్తడు

చుక్కలొస్తయి
ఉరుములొస్తయి
మెరుపులొస్తయి
ఇంద్ర ధనస్సు మొలుస్తది

ఒక్కోమెరుపుకు
ఒక్కో వెలుగు
ఒక్కో ఉరుముకు
ఒక్కో భాష..

చెప్పు
ఏ వెలుగుల్ని మాయం చేస్తావు?
ఏ ఉరుముల్ని  అడ్డుకుంటవు??

*

నువ్వొకసారి
ఒకటిని ఒకటితో గుణించు
ఒకటిని ఒకటితో భాగించు
ఒకటే వస్తుంది కదా!
ఒకటిని ఒకటితో కలిపి చూడు
రెండవుతది!
ఒకటిని రెండుతో కలిపి చూడు మూడవుతది!
మూడు,నాలుగుతో కలిపిచూడు
నాలుగు,అయిదవుతది!!

ఎప్పుడైనా 
ఒకటికి ఇంకొకటి తోడవుతనే అది విస్తృతమవుతది
దాని విలువ పెరుగుతది

ఏదీ
నువ్వొక్కచోటనే ఉండు
ఎంతసేపు ఉండగలవు?
ఒక్కచోటనే నడువు
ఎంతదూరం నడవగలవు?
ఒక్కడివే మాట్లాడు
ఏమని మాట్లాడుతవు?
నువ్వెక్కే మెట్టు దిగే మెట్టు ఒక్కటే కాదు కదా??

ఒక్క రాయితో పునాదిని కట్టు?
ఒక్క ఇటుకతో గోడను నిలబెట్టు?
ఒక్క అక్షరంతో వాక్యాన్ని రాయి?
ఒక్క అడుగుతో నడకను సాగించు??

నువ్వు
కాళ్ళకు తొడుక్కున్న చెప్పులు రెండు కదా?
నీ చూపుకు మొలిచిన కళ్ళజోడు రెండు అద్డాలు కదా?
నీ చేయికే ఐదు వ్రేళ్ళు కదా??

ఒక్కడివే 
ఆట ఆడి చూడు?
నువ్వు గెలవాలన్నా 
ఓడే వాడు ఒకడు ఉండాలే కదా?
నువ్వు గెలిచాకా
చప్పట్లు కొట్టేందుకైనా ఒకడు ఉండాలే కదా?
నువ్వు పోయాకా 
మోసేందుకైనా ఇద్దరో నలుగురో కావాలే కదా??

*

ఒక్కటై 
ఉందామని గొంతెత్తు
ఒప్పుకుంటాను
ఒక్కటే 
ఉండాలని అరవకు
ఒంటరిగానే మిగిలిపోతాం

తెలుసుకో
ఎప్పుడైనా ఒకటి ఒంటరే..
అది భాషైనా,సంస్కృతైనా!!

బిల్ల మహేందర్ 

click me!