బలి కోరే అమాయకత కాదు సత్యపు శిల్పం చెక్కే ఉలిగా ఉండాలి! అంటూ కరీంనగర్ నుండి కె ఎస్ అనంతాచార్య రాసిన కవిత " బాధ్యత !! " ఇక్కడ చదవండి :
ఇది ఒక వ్యక్తికి
పరిమితమైన మాట కాదు
విశాల ప్రపంచానికి
చెప్పే ప్రేరణాత్మక భాష
నిలబడలేని
నిస్సహాయతకు నీడయై నడిచే ఆసరా!
కోతలు కాదు
చేతలు కావాలి
పందిరి గుంజలా
భారం మోసే భరోసాలా!
undefined
బలి కోరే అమాయకత కాదు
సత్యపు శిల్పం చెక్కే ఉలిగా ఉండాలి!
కుటుంబ బంధాల జడలో అల్లుకుపోయే
మల్లికల పరిమళించాలి
అజ్ఞానం మీద
జ్ఞాన శర సంధానం చేసే ద్రోణాచార్య
మార్గ నిర్దేశనమై నిలవాలి
ఆకలికి సొమ్మసిల్లిన
బక్క పేగులకు గంజి పోసే
దుత్తలా పెత్తనం భుజానికెత్తుకోవాలి
సమాజం కుళ్లు కడిగే అగ్ని కణికై మెరవాలి
కవి రాత, నడత
కవల పిల్లలై
నాణానికి ఇరువైపులా
దర్శన మిచ్చినపుడు
నీ లోని మనసును ఆవహించిన నీలి నీడలు తొలగించుకొని నల్ల బల్ల మీద సుద్ద ముక్కవై
జాతి ఐక్యతా గీతం రాసినప్పుడు .....
చైతన్య చిరునామాగా నిలబడినప్పుడు...
అప్పుడు.... అపుడే..
నీ కథ బాధ్యతాంతం !
నీవే ఒక నిలువెత్తు దృష్టాంతం!