వస్తూ వస్తూ వానా కాలం నాకీ పద్యాన్నిచ్చింది!! అంటూ మహబూబ్ నగర్ నుండి కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన ఆసక్తికరమైన కవిత " ఒక వాన- కొన్ని దృశ్యాలు! " ఇక్కడ చదవండి
మబ్బులు తొలగిన ఆకాశం
తలొంచి చూస్తున్నది
తొలకరి జల్లుకు తడిసిన పారిజాత వృక్షాన్ని!
తొలి సంధ్య వెలుగూ అంతే
నిన్న లేని అందాలను కని
పెరటి మొక్కల్ని తడిమి చూసి మురుస్తున్నది!
ఓర్వలేని పక్కింటి పాదచారి
అటూ ఇటూ చూసి
పూలకొమ్మనొకటి విరిచేసి పోతున్నడు!
తుంటరి పిల్ల గాలొకటి పూల గంధాన్ని
మట్టి పరిమళాన్ని మేళవించి
నన్నుక్కిరిబిక్కిరి చేసి ఆట పట్టిస్తున్నది!
సకాలంలో కురిసిన వర్షం మౌనంగా
ఒక హామీ పత్రం రాసిచ్చి
ఆకలి చావుల భయాల్ని తరిమేసింది!
నెర్రలు వారిన నేల తల్లి ఎప్పటిలాగా
తనకు తానుగా నెమ్మదిగా
ఆకుపచ్చ చీరనొకటి నేసుకుంటున్నది!
దేశమంతా ఒకటే ఎన్నికల గోల
ప్రకృతికివేమీ పట్టవు సుమా
తన పని తాను చేసుకపోతున్నది!
వస్తూ వస్తూ వానా కాలం
నన్ను తన్మయంలో ముంచెత్తి
నాకీ పద్యాన్నిచ్చింది!!