రాఖీ పౌర్ణమి చంద్ర బింబాలు: కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత

By telugu teamFirst Published Aug 23, 2021, 1:34 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో భావోద్వేగాలను వెలువరించే ప్రత్యేక ప్రక్రియ కవిత్వం. కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా హృద్యమైన కవిత రాశారు. చదవండి

ఇప్పుడు
మా అమ్మ నాన్నలు
స్మృతి వనంలోని తులసి మొక్కలే!

రాఖీ పౌర్ణమీ వచ్చిందంటే చాలు
ఒకే సారి నాలుగు చంద్ర బింబాలు
వెలుగులు విరజిమ్ముతూ మా ఇంట్లోకి వస్తాయి!

వాళ్ళు నాచేతికి రాఖీలు కడుతుంటే
పేగు బంధాలు
జీవన కాంక్షల్ని మొలకెత్తిస్తాయి!

వాళ్ళొచ్చిన ప్రతి సారి
మా లోగిలంతా
పల్లె వెలుగుతో విప్పారుతుంది!

ఇప్పుడు వాళ్ళంతా
అమ్మమ్మలు నానమ్మలై
నాలా జీవన మలి దశతో మెరిసిపోతున్న వాళ్ళే!

అయినా మేమందరం కలిస్తే చాలు
మా మధ్యన బాల్యపు కాంతులు
అలౌకిక ఆనందాన్ని ప్రసరింప జేస్తాయి!

వాళ్ళందర్నీ నేను
చిన్నప్పుడు ఎత్తి దించిన వాణ్ణే
పేరుకే అన్నను కాని మిక్కిలి స్నేహితున్ని!

ఆ నలుగురు
మా ఇంటికి వచ్చినప్పుడల్లా
మా అమ్మ నాలుగు రూపాలెత్తినట్లుంటది!

నా చేతికి నాలుగు దారప్పోగులు కట్టి
వాళ్ళు రక్త సంబంధాన్ని
వెంటాడే  కవితా వాక్యాలను చేసి వెళ్ళిపోతారు!

click me!