హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈనెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరిగింది. అయితే మనుషుల్లో జ్ణానాన్ని పెంపొందించి, ప్రగతిశీల దృక్పథానికి బాటలు వేయాల్సిన ఈ పుస్తక ప్రదర్శన ఉనికిని కోల్పోయి సృజన స్పృహకు తూట్లు పొడవడం పాఠకులు పొందిన విషాదానుభూతే!! అంటూ కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి రాసిన కవిత ఇక్కడ చదవండి :
రాసులు రాసులుగా పుస్తకాలు
విచ్చుకున్న పూలవనంలా
తడిమి తడిమి చూసుడే తప్ప
దమ్మిడీ రాల్చని పర్సులు!
రవ్వా శ్రీహరి సాక్షిగా
భావ జాలాల పేరు మీద
నిలువునా చీలిపోయిన మనుషులు
బయటి అసమానతలన్నీ
లోపల మరింత స్పష్టంగా
సమస్త వివక్షలన్నీ
మరింత బహిర్గతంగా!
ప్రధాన వేదిక ఆ పది రోజులు
హడావుడి ఫ్యాషన్ పరేడే!
వచ్చామా కనిపించామా అంతే
ఒక సెల్ఫీ ఒకింత నటన!
ఎవరి అవసరాలు వారివి
ఒకరిని మరొకరు వాడుకునే స్నేహాలు
ఎవరి సమూహం వారి వెంటే
సమాజోద్ధరణ ఓ కాగితపు పువ్వే
ఆచరణ త్యజించిన ఋషిత్వం
ఆబగా ప్రచారాన్ని కలగంటున్నది!
ఈసారి బుక్ ఫేర్ ఉనికిని కోల్పోయి
సృజన స్పృహకు తూట్లు పొడవడం
పాఠకులు పొందిన విషాదానుభూతే!!