తెలుగు సాహిత్యంలో కవిత్వానిది విశిష్టమైన స్థానం. కాసుల ప్రతాపరెడ్డి రాసిన ఓ మహా వృక్షం కూలినప్పుడు కవితను ఇక్కడ చదవండి.
నేనేమీ మాట్లాడను
ఊపరి దారం తెగిపోయింది
విషాద ప్రవాహం సుళ్లు సుళ్లు తిరుగుతూ చుట్టేస్టోంది
గొంతు దాటని మాట లోపల రగులుతూ ఉంది
ఎడతెగని లోపలి సంభాషణకు ముగింపు లేదు
తప్పొప్పులను నిర్ణయించడమో, నిర్ధారించడమో చేయలేను
నాకేమీ కోపాలూ తాపాలూ లేవు
మునుగుతున్న నావను నేను
గోదావరి నది పరవళ్లు తొక్కినప్పుడు విశ్వాసం ఊతకర్రతో ఈదినవాడిని
విశ్వాసం తాడు పురులు ఊడుతుంటే కట్టుతప్పినవాడినే
దేహం ఒడ్డును ఒరుసుకుంటూ నెత్తురు ప్రవాహం
గాయాల నొప్పులను పంటి బిగువన పట్టి ఉంచినవాడ్ని
ఏదో ఒక ఒడ్డున నించుని వాదులాటలు చేయలేను
అడవులు తరిగిపోతుంటే కన్నీటిని దిగమింగుతున్నవాడ్ని
ఒక వృక్షాన్ని నరికినప్పుడో, మహా వృక్షం కూలినప్పుడో
గుండె రొదను వినలేక కునారిల్లుతున్నవాడ్ని
ఒంటరి దు:ఖాన్ని ఆయుధం చేయలేనివాడ్ని
శరీరాన్ని విల్లుగా వంచలేనివాడ్ని
ఎరుక ఎంత స్పష్టమో, అంత అస్పష్టం కూడా
సత్యానికీ అసత్యానికీ మధ్య చిరిగిన పొర
అర్థ శతాబ్దిగా ఆకులు రాలుతున్న కాలమే
వసంతం కోసం ఎదురు చూస్తుంటే శిశిరం తరుముకొస్తున్నది
ఆశల రెక్కలు తొడుక్కుని ఎగరలేని గడ్డ కట్టిన చైతన్యం
పిడికిళ్లు సడలుతుంటే నిబ్బరంగా ఉండలేనివాడ్ని
వీరుడు చరిత్ర పుటల మీద సంతకం చేసి వెళ్తాడు
మరణం సహజమూ అసహజమూ కూడా
జ్ఞాపకాలు ఇప్పుడు అజ్ఞాతం కావు, జైలు గోడలూ కావు
త్యాగాల కీర్తనలే కాదు, జ్ఞాపకాలూ భుజకీర్తులయ్యాయి
ఎన్నటి త్యాగమో ఇప్పటికీ నులిపెడుతున్నది
జీవితాన్ని ఊరేగింపు చేసుకోలేను
నమ్మండి...
నిస్సందేహంగా ఏమీ మాట్లాడలేను