పగలులో వెలుగే నా నమ్మకం !/నమ్మకం ఒక గొప్ప ధైర్యం !! నా నమ్మకమే వేరు !!! అంటున్న కందుకూరి శ్రీరాములు కవితలోని నమ్మకాన్ని చూడండి.
నమ్మకం ఒక గొప్ప ధైర్యం !
నమ్మకం
బతుకును సుగంధ భరితం చేస్తుంది
నమ్మకం
భవిష్యత్ ఆకాంక్షలకు
నిచ్చనలేస్తుంది
అడుగు ముందుకు వేయటమో
ఆకాశాన్ని తేరిపార చూడటమో
ఒక నమ్మకం !
ఆకు కదలికే
నాలో తుఫాన్లు రేపుతుంది.
కాలం మార్పే
నాలో ఒక అంకురార్పణచేస్తుంది
నా సంస్కృతి
నా సంప్రదాయం
ఒక నమ్మకం!
నా రచన
నాకొక వేదం
నేనో కవిని
అది ఒకనమ్మకం !
* * * * *
నా నమ్మకం వేరు
నా నమ్మకం
నటన కాదు
ఒక వెలుగు !
ఒక సంఘర్షణ !
తరతరాలను మార్చే
ప్రయత్నం !
నా నమ్మకం నది !
ఆలోచనల ప్రవాహాలు
అంతర్గత సముద్రాలు
ఆవిర్ల ఆవేశాలు
ఆక్రోశాల మేఘావృతాలు
ములుకులు లేని పలుకులు
మలుపులొక
కొత్త ఊహకు పునాది
నా నమ్మకం వేరు
సిరాను నమ్ముతాను
రాతను నమ్ముతాను
జరుగుతున్న ఘోరాన్ని చూస్తాను !
రణాన్ని నమ్ముతాను
రక్తాన్ని నమ్ముతాను
కళ్ళల్లో జీరలు చూస్తాను !
ఆకాశం ఒంపిందంటే
భూమి కంపించిందంటే నమ్ముతాను
నిదురరాని కలలో
ఊపిరాడక చావటం చూస్తాను !
మెరవటం
ఉరమటం నమ్ముతాను
బురదలోంచి పద్మాన్ని వింతగా చూస్తాను !
సూర్యుణ్ణి
చుక్కల్ని నమ్ముతాను
ఉదయ సంధ్యలోంచి
నిప్పులు చిమ్ముతున్న
ఎరుపు చూస్తాను !
చంద్రుణ్ణి
నెలవంకల్ని నమ్ముతాను
కరోనాలోంచి బతుకు బరోసాను చూస్తాను
పగలును
రాత్రిని నమ్ముతాను
జలప్రళయంలోంచి
పేదజీవి తలెత్తటం చూస్తాను !
రాత్రిలో పగలు చూడటం కాంక్షిస్తాను !
నీచరాజకీయాలోంచి
ప్రజాస్వామ్య పరిరక్షణను చూస్తాను !
పగలులో వెలుగే నా నమ్మకం !
నమ్మకం ఒక గొప్ప ధైర్యం !!
నా నమ్మకమే వేరు !!!