డాక్టర్ కాలువ మల్లయ్య సప్తతి సాహితీ సంబురాలలో భాగంగా "తెలుగు కథకు ఉత్తరదిశ-తెలంగాణ భాషకు సాహిత్య దశ" అనే అంశంపై ఒక రోజు సాహిత్య సదస్సు జరిగింది.
తెలంగాణ పల్లె ప్రజల జీవితాలను అక్షరబద్ధం చేసిన ప్రఖ్యాత కథా రచయిత, నవలాకారుడు డాక్టర్ కాలువ మల్లయ్య అని కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జి. శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. సాహితీ సోపతి కరీంనగర్ ఆధ్వర్యంలో కామ్రేడ్ బి. విజయ్ కుమార్ ప్రెస్ భవన్ లో ఆదివారం జరిగిన డాక్టర్ కాలువ మల్లయ్య సప్తతి సాహితీ సంబురాలలో భాగంగా "తెలుగు కథకు ఉత్తరదిశ-తెలంగాణ భాషకు సాహిత్య దశ" అనే అంశంపై ఒక రోజు సాహిత్య సదస్సు జరిగింది. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్లయ్య రాసిన "సాహిత్యంతో నా సహజీవనం", "జీవితం అంటే ఏమిటి?", డాక్టర్ బొద్దుల లక్ష్మయ్య రాసిన "మా ఊరు తేలుకుంట" పుస్తకాలను ఆవిష్కరించారు.
శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ఇంగ్లీష్ నాటక రచయిత షేక్స్పియర్ సామాన్య ప్రజల జీవితాలను నాటకాలుగా మలిచినట్టు, కాలువ మల్లయ్య అట్టడుగు ప్రజల బతుకులను కథలుగా, నవలలుగా మలిచినారని అన్నాడు. దీన జనుల కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప రచయిత కాలువ మల్లయ్య అని కొనియాడారు. పల్లె సంస్కృతిని సంప్రదాయాలను ఆప్యాయతలను అనురాగాలను మల్లయ్య రచనలలో ఎంతో నేర్పుగా చిత్రించాలని ప్రశంసించారు. మల్లయ్య సాహిత్యం మీద 30 మంది ఎంఫిల్, పి హెచ్ డి, పట్టాలను పొందడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గాజోజు నాగభూషణం, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పి. కిషన్, సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్, తెరవే రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సదస్సు సమన్వయకర్త కూకట్ల తిరుపతి, డాక్టర్ సందెవేన తిరుపతి, డాక్టర్ పోతరవేన తిరుపతి, కాలువ విజయలక్ష్మి మాట్లాడారు.
undefined
అక్కపెల్లి ఫౌండేషన్ తరఫున డాక్టర్ కాలువ మల్లయ్యకు సినారె స్మారక సాహిత్య పురస్కారాన్ని అక్కెపల్లి బాల్ రెడ్డి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సందినేని సురేందర్, మహేందర్, డా. అమరేందర్, నడిమెట్ల రామయ్య, మమతవేణు, పెనుగొండ బసవేశ్వర్, తప్పెట ఓదయ్య, గజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలువ మల్లయ్య దంపతులను సాహితీ సోపతి ఘనంగా సత్కరించింది. సాహితీవేత్తలు సృజన కారులకు డాక్టర్ కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారాలను, ప్రతిభా పురస్కారాలను అందించినారు.
జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో ప్రఖ్యాత కథా రచయిత అల్లం రాజయ్య, సాహిత్య విమర్శకులు దాస్యం సేనాధిపతి, పీవీ సాహిత్య పీఠం కెవి. సంతోష్ బాబు, అక్షరం ప్రభాకర్, పొన్నం రవిచంద్ర, డాక్టర్ సిద్దెంకి యాదగిరి, కల్లెపల్లి సదన్, అనిశెట్టి రజిత, దామరకుంట శంకరయ్య, పెనుగొండ సరసిజ, వైరాగ్యం ప్రభాకర్ తదితరులు కాలువ మల్లయ్య గారికి అభినందనలు తెలియజేశారు.