సామాజిక చైతన్యాన్ని తట్టిలేపే "విశ్వసారథి"

By Pratap Reddy Kasula  |  First Published Dec 13, 2021, 8:46 AM IST

మిద్ది సాయి కుమార్ రెడ్డి కవితా సంకలనం "విశ్వ సారథి" పై చిత్తూరు జిల్లా పీలేరు నుండి వినాయకం ప్రకాష్ చేసిన సమీక్ష ఇక్కడ చదవండి.


ప్రపంచంలో తెలియని రహస్యాలు ఎన్నో ఆ రహస్యాల్లో నేను ఒక్కన్ని, సమాజంలో మార్పు కోసమే  నేను... నా అంతరంగం అంటూ మొదలు అయిన ఈ పుస్తక పరిచయం నేటి సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు, వాటి పర్యవసానాన్ని చక్కగా వివరిస్తూ మంచి పుస్తకం రాయాలంటే గొప్ప పండితులే కానవసరంలేదు సమాజం పట్ల బాధ్యత మరియు సమాజం కోసం  ఆలోచించే తీరిక ఉంటే చాలని నిరూపించాడు మన "విశ్వ సారథి " రచయిత మిద్ది
సాయి కుమార్ రెడ్డి.

రచయితకు పట్టుమని పాతికేళ్ళు కూడా లేకున్న.. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చదువులమ్మకు దత్తపుత్రుడై ప్రఖ్యాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి  కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతూ ఒక పక్క చదువు మరొక పక్క సమాజం కోసం సాహిత్యాన్ని ఎంచుకుని తనదైన శైలిలో కవితా బాణాలను సంధిస్తూ శభాష్ అనిపించుకొని రేపటి తరానికి ఆదర్శంగా నిలిచారు సాయి కుమార్ రెడ్డి.

Latest Videos

తన జీవితంలో ఎందరో మహానుభావుల నుంచి స్ఫూర్తి పొంది, అంతర్గత సంఘర్షణలు స్పందనలు ప్రతిఫలింప చేయడానికి ఉపయోగపడే ఏకైక శక్తి భాషకు మాత్రమే ఉందని గ్రహించి తెలుగు భాషలో అనేక రచనలు చేస్తూ తనదైన శైలిలో సామాజిక చైతన్యానికి నాంది
పలుకుతున్నారు ఈ యువ కవి.

"విశ్వ సారథి" పుస్తకంలో 36  చక్కని కవితలున్నాయి. ప్రతి కవిత దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది.  ఇందులో వాడిన భాష గాని కవిత సారం కానీ చాలా చక్కగా పండిత పామరులకు కూడా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వీటి ప్రత్యేకత.   అన్ని కవితలు దాదాపు సామాజిక చైతన్యం మీద సమాజంలోని వివిధ కోణాలను ఉద్దేశించి రాసినవే.    

ఈ కవితలు  ఒక సారి చదివినప్పుడు మనకు చిన్నప్పటి తెలుగు పాఠ్యాంశాలు గుర్తుకు వస్తాయి.   పాఠ్య పుస్తకాల్లో లాగా  విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చక్కటి పాఠ్యాంశం, సారాంశ చిత్రాలు  మరియు చివరిలో ఆ మొత్తం పాఠ్యాంశం యొక్క సారాంశం ఉన్నట్లుగా కవితలు మరియు వాటి సారాంశం వాటికి తగిన చక్కని చిత్రాలు పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఈ విధానం వినూత్నంగా ఉంది.

వీరి  "శ్రీ స్త్రీ" కవితను ఒకసారి మనం పరిశీలిస్తే
"మా కూతుళ్ళ జోలికొస్తే
మా ఖడ్గాలకు
మీ జీవితమే నైవేద్యం
మీ  చూపుల  రెక్కల్ని విరగొట్టే
అమరేంద్రుని వారసులం"
అంటూ నేటి సమాజంలో స్త్రీ లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ  ఈ కవిత  ద్వారా  రచయిత స్త్రీ పక్షపాతిగా నిలిచి మెప్పించారు.

"పెట్రోల్  ఘాతం" కవిత ద్వారా ప్రకృతి  వనరుల ఆవశ్యకతను గుర్తుచేస్తూ, "కొలి మవుతున్న పుడమి" కవిత ద్వారా మన నేలతల్లిని అధిక తాపం నుంచి ఎలా రక్షించుకోవాలనే సందేశం ఇచ్చారు, ఇలాంటి కవితలు చదివినప్పుడు మనకు కవిలోని  పర్యావరణం పట్ల శ్రద్ధ చెప్పకనే చెబుతుంది.

ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం యువతపై ఎక్కువగా ఉంది, ఇవి రెండు వైపులా  పదునున్న  కత్తి లాంటివి వీటి ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో అని అనర్థాలు కూడా జరుగుతుండడం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము.  ఇటీవలి కాలంలో ఫేస్ బుక్  ద్వారా జరుగుతున్న మోసాలను తన "ఫేస్(క్) "బుక్కై"పోయా" కవిత ద్వారా చక్కగా వివరిస్తూ ఈ మాధ్యమం ద్వారా ముఖ పరిచయం లేని వ్యక్తుల నుంచి ఏ విధంగా మోసాలు జరుగుతూ   ఆర్థిక పరంగా నష్టపోతున్నారో చివరికి ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్న  వైనాలను కూడా చక్కగా వివరించి యువతను సమాజాన్ని చైతన్యం చేశారు కవి.

"అజ్ఞానంలో అభిమానం" కవిత ద్వారా నేటి యువత యొక్క ఆలోచనా ధోరణిని కడిగిపారేశారు కవి.
"స్వాతంత్ర్య వీరుల త్యాగాలు
నేడు ఎండమావులే అయ్యాయి
పోరాట కవుల భావాలు
సంద్రపు నీరు అవుతున్నాయి"  అంటూ ,
"దేశభక్తి తో నిండాల్సిన  గుండెలు మత్తుతో నిండిపోయి తల్లిని తిట్టినా భరిస్తున్నారు కానీ సినిమా బాలేదు అంటే సహించడం లేదు"
అజ్ఞానము నిండిన అభిమాన మనే వెర్రిలో తేలుతున్నారు నేటి యువత  అని ఆవేదన చెందారు.

నేటి న్యాయవ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తిచూపే క్రమంలో కవి ద్రవించిన హృదయంతో  కవిత రాసిన తీరు బాగుంది," ఎన్ని చట్టాలొచ్చినా కామాంధుల వేట ఆగడం లేదని, మానవత్వం దహించుకుపోతుంటే సమానత్వం సొమ్మసిల్లి సమాప్తం అవుతోంది  నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా ధర్మమా..?" అని  న్యాయదేవతను ఇకనైనా కళ్ళు తెరచుకోమని ప్రాధేయడపడి కవిత రాసిన తీరు ఆలోచింపజేస్తుంది.

ఉత్తమ కవి తన  కవితల ద్వారా సమాజంలో అనేక కోణాలను పరిశీలించి వాటిలోని లోటుపాట్లు మంచి చెడూ అక్షరీకరించి సమాజాన్ని తట్టి లేపాలి.   ఈ ప్రయత్నాన్ని కవి " విశ్వ సారథి" లో చక్కగా చేశారు.   ఎవరూ స్పృశించని పెద్దగా ప్రశ్నించని అంశాలన్నింటినీ కూడా  చక్కగా తన పుస్తకంలో పొందుపరచి కవిత్వీకరించడంలో  సాయి కుమార్ రెడ్డి దిట్టగా నిలిచాడు.

డియర్ జర్నలిస్ట్ కవితలో సైనికుడు సరిహద్దుల్లో పోరాడితే ప్రతి పొద్దుల్లో పోరాడే వాడే జర్నలిస్ట్ అంటూ వారి త్యాగాలు మెచ్చుకొంటూ వారి సమస్యలను వారిని గౌరవించాల్సిన ఆవశ్యకతను చక్కగా వివరించారు.

నేడు మాతృభాష నానాటికీ ప్రాబల్యం కోల్పోయి ఆదరణ కోల్పోతోంది ఇలాంటి స్థితిలో  బాషాభిమానులు అందరూ మన  భాషని, సాహిత్యాన్ని కాపాడుకోవాలి.  సాయి కుమార్ రెడ్డి కూడా ఇదే ప్రయత్నం  తన కవిత "మాతృభాష" ద్వారా తేనెలాంటి తెలుగంటే చేదెందుకో అంటూ ఒకప్పుడు విశ్వవిఖ్యాత ప్రాభవం పొందిన తెలుగు భాష  నేడు తనకంటూ ఒక బాట కోసం  బాటసారిలా ఒంటరవుతున్నదని, ఇకనైనా  ప్రతిఒక్కరూ  ఒక పాంచ జన్యమై తెలుగు వైభవాన్ని చాటాలి అని స్ఫూర్తి రగిలిచాడు కవి.

తన పుస్తకంలో తన గురించి తానే రాస్తూ "ప్రశ్నని జవాబుని  కూడా తానే అంటూ తనని తాను ఇక దేశభక్తి గల భారతీయునిగా బలంగా నమ్మి " నా దేశం  జోలికొస్తే భగత్ సింగుని,  సమరసింహం సుభాష్ చంద్రబోస్ ని, గాంధీజీని, దేశం కోసం మరుగుతున్న యువ నెత్తురుని అంటూ దేశ భక్తికి ప్రతిరూపమై కవిత రాసిన తీరు చాలా ఆదర్శంగా ఉంది.  ఇలాంటి యువత దేశానికి ఎంతో అవసరం.

తన "విశ్వ సారథి" కవితలో
"నా కవిత్వం ప్రవణ వీచిక
ప్రచండ వాయువేగ దిశా నిర్దేశకం
మదనోన్మత్త ప్రమత్తులను
తొలగించి దాస్యపు చీకట్లను చీల్చుకువచ్చే వెలుగు కిరణం నా కవిత్వం" అంటూ  తన కవిత్వం యొక్క ఏకైక లక్ష్యం సామాజిక చైతన్యం,  తన ప్రతీ అక్షరం  సమాజంలో మార్పుకోసమే అంటూ చిన్న వయసులోనే మహోన్నతమైన భావాలను కవిత్వంగా రూపొందించి మహామహుల చేత  శభాష్ అనిపించుకున్న యువ కవి   మిద్ది సాయి కుమార్ రెడ్డి.   వీరి కలం నుంచి ఇంకా మంచి రచనలు రావాలని వీరి సాహిత్య లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతూ సాయి కుమార్ రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

click me!