ప్రముఖ కవి జ్వలిత రాసిన నెత్తురోడే గోటీలాట కవితను ఇక్కడ అందిస్తున్నాం. జ్వలిత తెలుగు కవిత్వ ప్రక్రియలో పేరెన్నిక గన్నవారు.
ఇక్కడ రెండు సేవలు
పోటీ పడుతున్నాయి
యుద్ధం చేస్తున్నాయి
పరస్పరం ద్వేషించుకుంటూ
చిత్రహింసలు పెట్టుకుంటూ
ఒకేదేహంలోని రెండు అవయవాలు
మారణహోమం సృష్టిస్తున్నాయి
తుపాకులకు మనసు ఉండదు
ఆయుధాలకు కళ్ళు కూడా ఉండవు
రక్షణ కోసం చేసిన వస్తువులు అవి
కానీ దానిని ఉపయోగించే శరీరానికి
ఒక మెదడు ఉండాలి కదా
ఏమి రక్షించాలో నిర్దేశనమే కదా
ఒకటి ఉద్యోగం మరొకటి ఉద్యమం
వేతనం పొంది సేవలందించే ఒప్పందం అంగీకారంతోనే త్యాగాలకు సిద్ధమయ్యాము
గడ్డకట్టే అవయవాలను ముందే ఊహించుకున్నాం
వెన్ను పొడిచే ఆయుధాలను అంచనా వేశాం అందుకే అదనంగా సౌకర్యాలను అందుకుంటున్నాం
రెండవ ఒకటి అనేకానేక కారణాలతో
అణిచివేతకు దోపిడీకి అవమానాలకు
పరిష్కారాన్వేషణలో
ముళ్ళదారిని ఎంపిక చేసుకున్నాం
చట్టాలతో పాటు చుట్టాలను పక్కకు పెట్టాము
న్యాయంలో శూన్యాన్ని పసిగట్టాం
హక్కుల పోరులో సర్వం వదిలేశాం
ఆకలి దప్పిక నిద్ర సుఖం త్యాగించి
ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు నిర్ణయించేశాం
ఒకదానితో పోలిక లేని మరొకటి
యుద్దామాడుతున్నాయి
తమదిగాని ఆటకు పావులయ్యాయి
మార్గాలు వేరైనా ఒకటే గమ్యం
రక్షించడమే లక్ష్యం అంటూ
భక్షించుకుంటున్నాయి పరస్పరం
మొక్కలు నాటి రక్షించాల్సిన చోట
కూచ్చున్న కొమ్మను నరుక్కుంటున్నాయి మైకంలో
రాజ్యమాడే గోటీలాట మత్తులో
సీసపు గుండెల గోలీలాట ఎవరిది
అసలీ ఆటల వ్యూహం ఎవరిది
రెండు సేవలు ప్రాణాలొదిలి గెలిచేదెవరు
శిక్షణిచ్చేది శిక్షలు వేసేది ఎవరు
బై ద పీపుల్ - ఫార్ ద పీపుల్
రాజ్యమాడే నెత్తురోడే గోటీలాట