అమెరికన్ కవి దోరైన్ లాక్స్ కవిత: సాయంకాలం

By telugu teamFirst Published Jan 21, 2021, 4:11 PM IST
Highlights

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ అమెరికన్ కవి దొరైన్ రాక్స్ కవితను సాయంకాలం పేరిట తెలుగులోకి అనువదించారు. ఆ కవితను చదవండి.

చెట్లకింద 
ఎంతమంది గతించారనే 
పట్టింపయినా లేకుండా 
దయలేని వెన్నెల 
నిర్విరామంగా కురుస్తూనే వుంది
నది ప్రవహిస్తూనే వుంది
ఇంటిపక్క గులకరాళ్ళపై ఎవరో 
ముంజేతులు ఆనించి విలపిస్తున్నారనే 
పట్టింపయినా లేకుండా 
ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది
బాధ దుఖమూ 
అన్నీ ముగుస్తాయి
హంస 
మెల్లగా నడుస్తూనే వుంది
కఠినమయిన చీకటి నడుమ 
ఈకలతో కూడిన తన తలబరువును 
రెల్లు మోస్తూనే వుంది 
గులకరాళ్ళూ అరిగిపోతాయి
సంచుల్నీ బరువుల్నీ బహుమతుల్నీ మోస్తూ 
మనం దూర దూరాలకు 
నడుస్తూనే వుంటాం
మాకు తెలుసు 
సముద్రం కింది భూమి కనుమరుగవుతున్నదని 
పురాకాలపు చేపల్లాగా 
ద్వీపాల్ని మింగేస్తున్నాయని
మాకు తెలుసు 
మేం విఫలులం,దౌర్భాగ్యులమని 
ఇప్పటికీ చంద్రుడు మానుంచి దాగివున్నాడని 
చుక్కలు సుదూరంగా వున్నాయని
అయినా వెలుగు మమ్మల్ని చేరుతుంది 
మా భుజాలపై కురుస్తుంది.

తెలుగు: వారాల ఆనంద్

click me!