గుడిపల్లి నిరంజన్ కవిత :  అడవి తుప్పల తోపు 

By Arun Kumar PFirst Published Nov 14, 2023, 2:07 PM IST
Highlights

జాతిని ఉద్దరించాల్సిన వాళ్ళే చేతులెత్తేస్తుంటే భరించలేని ఆవేదనతో  ' పండ్ల తోటలు పెరగాల్సిన చోట అడవితుప్పల తోపు వ్యాపిస్తుంది ' అంటూ నాగర్ కర్నూల్ నుండి గుడిపల్లి నిరంజన్ రాసిన కవిత ' అడవి తుప్పల తోపు ' ఇక్కడ చదవండి : 

అన్ని చెట్లు నిటారుగా పెరగవు
కొన్ని చెట్ల కొమ్మలు వంగుతుంటాయి!
కొన్ని ఆకులు రాలుతుంటాయి!

నీటి మీద నాచు 
ఎవరికీ ఇష్టం ఉండదు

పాకుడు జాతి
మొక్కల 'స్వభావం'
ఎవరికీ అర్థం కావడం లేదు
ఒత్తుగా ఉండే పాకర అంతరం
ఇప్పటికి అంతు పట్టడం లేదు

అడవి తుప్పలు
ఎక్కడైనా పెరుగుతుంటాయి
వాటికేమి లెక్క పత్రం ఉండదు

పొదలు ఎదలు విరుచుకుంటున్నాయి
సిత్రంగా ఆకుపచ్చని చెట్లు ముడుచుకుంటున్నాయి!

పొదల కింద
పువ్వులు వాడిపోతున్నాయి
గడ్డి జాతులు ఎండిపోతున్నాయి!

ఆకురాలు కాలాన్ని
ఎవరూ ఆపలేక పోతున్నారు
గుబురుగా వొచ్చిన ఇగురు
పురుగుపట్టిన
ఆకులా రాలిపోతుంది!

ఎండ తగులుతూ
పొడిగా ఉంటుంది
చీకటే భయంకరంగా
చిత్తడి నేలగా మారింది!

పండ్ల తోటలు పెరగాల్సిన చోట
అడవితుప్పల తోపు వ్యాపిస్తుంది

నేల పొరల మధ్య చెట్ల వేళ్ళు
అప్పుడప్పుడు రహస్యంగా
మాట్లాడుకున్న విషయాన్ని
పువ్వు పసిగట్టి
హాయిగా పైకి నవ్వుతుంది

మరీ ఇంత 'నేల బారుగానా'
పెరిగేది అని చీదరించుకున్న 
అడవి తుప్పలు అడగంటి పోయాక 
ఆకాశనికేసి చూస్తున్న 
చెట్ల శిఖరాలు
నీలి కలలు కంటున్నాయి !

click me!