కట్టుకున్న పిచ్చుకగూళ్ళను అలలు చెరిపేస్తే కళ్ళు తుడుచుకుని నవ్వుకున్నాడు అతడేం తప్పు చేశాడు? అంటూ భువనగిరి నుండి దండమూడి శ్రీచరణ్ రాసిన కవిత ' ఓ సందేహం!? '
అతడేం తప్పు చేశాడు?
మోడుకు రాలిన ఆకులు అతికించాడు
బీడుకు సెలయేరులు మళ్లించాడు
ఎడారుల్లోకి ఒయాసిస్సులు తెచ్చాడు
గుడారాల్లోకి చల్లని వెన్నెలను పంపాడు
అతడేం తప్పు చేశాడు?
అపరిచితులను ఆలింగనం చేసుకున్నాడు
అమాయకంగా నవ్వుల్ని బుడగలు వూదాడు
ఆకలేస్తే అడగకుండా తిన్నాడు
అతిథి వస్తే
జేబులు తడుముకుని నివ్వెరపోయాడు
అతడేం తప్పు చేశాడు?
ఏటి ఒడ్డున పిచ్చుకగూళ్ళు కట్టాడు
అలలు చెరిపేస్తే కళ్ళు తుడుచుకుని నవ్వుకున్నాడు
బండరాళ్లపై తన పేరు రాసుకున్నాడు
పాడుబడ్డ పరాయి ఇళ్లకు వెల్లవేశాడు
అతడేం తప్పు చేశాడు?
వాన వస్తే పడవలొదిలాడు
పాట వింటే పరవశించాడు
కొమ్మకో వూయల కట్టాడు
అమ్మలకు దండాలు పెట్టాడు
అమ్మాయిలకు తొలగి దారి ఇచ్చాడు
అతడేం తప్పు చేశాడు?
అక్షరాలకు మురిసిపోయాడు
ఆశలకు మింటికెగిశాడు
రాత్రుళ్ళు వీధుల్లు తిరిగాడు
తెల్లవార్లూ వేణువూదాడు
అతడేం తప్పు చేశాడు?
మనిషి అంటే మనిషే అనుకున్నాడు
మనసు అంటే మమత అన్నాడు
మరెందుకిలా
అర్ధరాత్రి
వూరు చివర
బావిలోన
విగతజీవిగ బ్రతుకు ముగిశాడు
అతడేం తప్పు చేశాడు?