ఇవ్వాళ అనగా జూన్ 21 ప్రజాకవి గూడ అంజయ్య వర్ధంతి సందర్భంగా జనగామ నుండి జోగు అంజయ్య రాసిన వ్యాసం ఇక్కడ చదవండి :
తెలంగాణలో ప్రజా పాటల హోరును పతాక స్థాయికి తీసుకెళ్లిన కవిగాయక దిగ్గజం గూడ అంజన్న ఈ లోకాన్ని వీడి అప్పుడే ఆరు ఏండ్లు గడిచిపోయింది. ప్రజల ఆకాంక్షలను బాధలను గుండె లోతుల్లోంచి పలికించే పాటల పెద్దన్న భౌతికంగా లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తుంది. పదహారేళ్ళ ప్రాయంలోనే రాసిన "ఊరిడిసి నేబోదునా అయ్యో ఉరిపెట్టుకొని సద్దునా..." అనే పదునైన పాట చెప్పిన ఆవేదనలోకి తెలంగాణ సమాజం మళ్ళీ వెళ్ళిపోయింది. గతంలో దొరల పాలనలో అనుభవించిన కష్టాలే నేడు స్వరాష్ట్ర పాలనలోను కనిపించడం దాయలేని నిజాలుగా ఉండి వెక్కిరిస్తున్నాయి. ఎక్కడ ఏ పథకం వస్తదో ఎందరి భూములు గుంజుకుంటారో అని ప్రజలు బిక్కు బిక్కు మంటూ వణికిపోవుచున్నారు. బువ్వతిన్నంత సులభంగా భూములు లాక్కుంటున్నారు.
ఇప్పుడు గూడ అంజన్న బతికి ఉంటే "అవ్వోనివా నీవు అయ్యోనివా" అనే దానిని తిరగ రాసి "తెలంగాణ వాడివా నీవు పగటి వేషగాడివా "అంటూ పాటల కచేరీ నిర్వహించేవాడు. తన తోటి సీనియర్ కళాకారులను తీసుకొని ప్రజల చెంతకు తిరుగులేని పాటలతో వచ్చేవాడు. తెలంగాణ తెచ్చుకున్నది తిట్టుకోవడానికి కాదురా పిచ్చి సన్నాసుల్లారా అని హెచ్చరించేవాడు. గంపెడాశలతో తెలంగాణకు జైకొట్టిన యువతరం భంగపాటుకు గురికావడం తీవ్రంగా కలచివేస్తుంది.
ఏకపక్ష నిర్ణయాలతో రాజకీయ ఐక్యత దెబ్బతిని ప్రజలు గందరగోళానికి గురౌతున్నారు. ఈ పరిస్థితులలో అరవై యేండ్ల కలలు ఆగం కాకుండా చూసే పెద్దతరం తెలంగాణాలో ఒక్కొక్కరుగా కనుమరుగు అగుచున్నారు. సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేసిన గూడ అంజయ్యను స్మరించుకొని భావితరాలకు తెలంగాణ పట్ల గౌరవ భావం నిలిచేలా కార్యక్రమాలను తీసుకోవాలి. త్యాగాల తెలంగాణ చరిత్రలో గూడ అంజన్నకు ప్రముఖ స్థానం ఉన్నదనే విషయాన్ని పాలకులు మరచిపోయినా ప్రజలు విస్మరించవద్దని కోరుచున్నాను.