వివక్షతలు లేని స్వేచ్ఛకై నినదిద్దాం అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత " ప్రశ్నలమై మొలకెత్తాలి..! " ఇక్కడ చదవండి :
వివక్షతలు లేని స్వేచ్ఛకై నినదిద్దాం అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత " ప్రశ్నలమై మొలకెత్తాలి..! " ఇక్కడ చదవండి :
ప్రశ్నలమై మొలకెత్తాలి..!
చెంతనే నీడలా వుంటూ
గుబులు పుట్టించే
స్వార్థ ప్రయోజనాలకు
బలైపోకుండా నిలువాలి
నిర్దేశించుకున్న మార్గంలో
తడబడకుండా సాగితేనే
ఆశయం నెరవేరుతుంది..!
చేతులు ముడుచుకుంటే
చైతన్యం వికసించదు
నిరసనల గొంతు వినపడితే
అణగతొక్కే యత్నాలు సిద్ధమౌతాయి
నమ్ముకుంటే నేరవేర్చుతామనే
వాగ్దానాల హామీలు వర్షిస్తాయి
నాకెందుకని ఊరుకుంటే
కాళ్ళ కింద నేలిక మిగలదు
ఉరుముల్లా మాట్లాడుతూనే
మెరుపుల్లా పోట్లాడుతూనే
నిలదీసే ప్రశ్నలమై మొలకెత్తాలి..!
మోకు దెబ్బలు మోగాలి
కుమ్మరి కొలిమి మండాలి
కమ్మరి సాలె లేవాలి
నేతన్నల పాటలు పోటెత్తాలి
సమస్త వృత్తుల ఐక్యత రాగాలు
సమర నాదాలై పల్లవించాలి
ఆత్మగౌరవ బతుకుల
చెదిరిన కలల సాకారం కోసం
కదలాలి... తరలాలి...!
నిర్బంధాల సంకెళ్లు ఇంకెంతకాలం
యుద్దాలు లేని, అసమానత్వం లేని
వివక్షతలు లేని, స్వేచ్ఛకై నినదిద్దాం
మునుముందుకు అవిశ్రాంతంగా
పోరు కెరటాలమై కదులుదాం...!