మాటల్లో మాత్రం విశాలమయం చేతుల్లో మాత్రం సంకుచితమయం పటిష్టమైన జీవన సౌధం బీటలు వారుతున్నది..! అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత ' పడగ నీడలా..! ' ఇక్కడ చదవండి :
అందరం సమానమే అయినప్పుడు
అంతరాల గురించి మాట్లాడడం
అవివేకమని ప్రశ్నలు గుప్పిస్తారు
పరిచితంగానో అపరిచితంగానో
వివక్ష పడగ నీడలా వెటాడుతున్నది...!
ఇప్పుడిక్కడ అవధుల్లేని తారతమ్యాలు
వీడిపోని వ్యసనాల్లా మారిపోయాయి
తడితనం చిగురించాల్సిన గుండెలో
కర్కషత్వం పాతుకపోతున్నది
కరుకుతనం విస్తృతమవుతున్నది..!
undefined
మాటల్లో మాత్రం విశాలమయం
చేతుల్లో మాత్రం సంకుచితమయం
బయటంతా సామూహికమయమే
లోలోపలంతా ఒంటరిమయమే
నిక్కచ్చితనం ఊబిలోకి కూరుకుపోతున్నది..!
గ్లోబలైజేషన్లో రంగమేదైనా కావచ్చు
రణ రంగానికి తెరలెప్పుడు లేచే ఉంటాయి
నిఘా నేత్రాలు అగ్ని కెరటాల్లా కురుస్తాయి
మానసిక సంక్షోభాల కలవరింతల్లో
మనుషుల జాడ కనుమరుగవుతున్నది..!
అడుగడుగునా వివక్షతల అడ్డంకులు
మితిమీరిపోయిన అధికార దర్పాలు
కానరాని ఆలోచనల సంకల్పాలు
మృగ్యమైపోతున్న అనుబంధపు రాగాలు
పటిష్టమైన జీవన సౌధం బీటలు వారుతున్నది..!