సమాజానికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పిన చేనేత పారిశ్రామిక రంగాన్ని కాపాడుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు.
జనగామ : సమాజానికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పిన చేనేత పారిశ్రామిక రంగాన్ని కాపాడుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు. జనగామజిల్లా మట్టి రేణువుల్లో ప్రతీ కణం కవిత్వమేనని జనగామ సాహిత్య గొప్ప తనాన్ని కొనియాడారు. చేనేత కార్మికుల జీవితాలను డా మోహన కృష్ణ భార్గవ తెలుగు సాహిత్యంలో కవితా సృజన చేయడం అభినందనీయమన్నారు. శనివారం జనగామలో డ్రగిస్ట్ భవనంలో జనగామ రచయితల సంఘం కోశాధికారి కోడం కుమారస్వామి అధ్యక్షతన డా ఎ. మోహన కృష్ణ రాసిన పోగుబంధం ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ చేనేత రంగంలో పాలకుల నిర్లక్ష్యం వలన చేనేత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. చేనేత పరిశ్రమలోని సాదకబాధకాలను మోహనకృష్ణ కవిత్వంలో చెప్పిన విధానం బాగుందన్నారు. మోహనకృష్ణ కేవలం రచయిత మాత్రమే కాదని, సామాజిక ఉద్యమకారుడని ప్రశంసలు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవడమేకాకుండా చాటి సాధన కోసం కృషి చేసే నిబద్దతగల యువకుడని అభినందించారు. జనగామ ప్రాంతంలో కవులు,రచయితలు సోమన, పోతన వారసత్వంగా రచనలు చేయడం అభినందనీయమన్నారు. జనగామ గడ్డ మట్టిలోనే పోరాడే మహత్తరమైన శక్తి ఉందన్నారు.
చేనేతకు బడ్జెట్ కేటాయింపు శూన్యం: ప్రొఫెసర్ కోదండరామ్ ఆగ్రహం
పోగుబంధం కవిత్వ పుస్తక ఆవిష్కరణలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న కోదండరామ్ మాట్లాడారు. తెరాస ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. చేనేత దినోత్సవం రోజున మాత్రమే సర్కారు కు చేనేత కార్మికులు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. ప్రమాదటంచుకు చేరుతున్న చేనేత రంగాన్ని కాపాడటానికి ప్రభావితం బడ్జెట్ నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమయ్యారని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
ప్రతియేటా కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడుతూ అంకెల గారడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యలతో చేనేత రంగం అభివృద్ధి సాధించలేదన్నారు. పాలకులు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటారే తప్పా చేనేతకు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి నిజాయితీ లేదన్నారు. మోహన కృష్ణ పోగుబంధంలో చేనేత జీవితాల సామాజిక వాస్తవికతను చిత్రికరించారని చెప్పారు. రచయితలు నిజాయితీగా నిలబడినపుడు మాత్రమే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కవులు, రచయితలు ప్రజా పక్షం నిలబడాలని కోరారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకుని పోవాలని కోరారు. శ్రీశ్రీ లాంటి కవులు సైతం జన పక్షంగా నిలిచారని చెప్పారు. జనగామ రచయితల సంఘం చేస్తున్న సామాజిక చైతన్య కృషిని అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా పోగుబంధం పుస్తకాన్ని రాపోలు సత్యనారాయణ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కవి డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ, జరసం నేత కోడం కుమారస్వామి, ప్రొఫెసర్ ఏ. బాలకృష్ణన్, ప్రొఫెసర్ టి. వెంకటరాజయ్య, జిల్లా టెక్సటైల్స్ హాండ్లూమ్స్ శాఖ డైరెక్టర్ మిట్టకోల సాగర్, డాక్టర్ వెల్ది రమేష్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, మచ్చ బాలనర్సయ్య, దోర్నాల వెంటేశ్వర్లు, బోగం రాందయాకర్, జరసం అధ్యక్షుడు పొట్టబత్తిని భాస్కర్, కార్యదర్శి సోమ నరసింహాచారి, గుడెల్లి సత్యనారాయణ, ఎక్కలదేవి చిదంబరం, బడుగు అంజనేయులు, గుర్రం భూలక్ష్మినాగరాజు, మచ్చ బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.