మత్తు ఎక్కగూడదని కోరుకొని మందు తాగిన వాడి పరిస్థితి రాజుది అంటూ ఏనుగు నరసింహారెడ్డి రాసిన కవిత ' స్వస్వరూపం ' ఇక్కడ చదవండి :
ఏ ఉన్ముఖీకరణ లేని నీతి వాక్యంలా
మాధ్యమాలు
మనోవీదుల వెంట
చల్లగాలని ప్రవహింపజేస్తాయి
రాజు మారిండు
రాజ్యం మారుతుందని
పవనాలెలా వీస్తున్నాయో చూడండని
గాలి భాషను
అందంగా అనువాదం చేసి పెడతాయి
పదేపదే మంత్రాంగ ప్రదక్షణం చేసేవాళ్లు
వెంటనే వేషాలు మార్చుకుంటారు
నటనలు వినూత్నంగా ప్రదర్శిస్తూ
కొలువు కూటాలు చేరుకుంటారు
రాజు వేషగాళ్లను అనుమానాస్పదంగానే ఆహ్వానిస్తాడు
మత్తు ఎక్కగూడదని కోరుకొని
మందు తాగిన వాడి పరిస్థితి రాజుది
అవును వాళ్ళ స్వభావం వాళ్ళదే
రాజ స్వభావం మెల్లమెల్లగా
అలాగే మారుతుంది
రాజ్యం మునప్పటి రూపాన్ని తొందర్లోనే సంతరించుకుంటుంది