గిరిజన కుంభమేళా “సమ్మక్క సారలమ్మ జాతర” చరిత్ర ప్రాశస్త్యం, ఆదివాసీ గిరిజన సంప్రదాయాలపైన పరిశోధనాదృష్టితో ఆచార్య సూర్యా ధనంజయ్ రాసిన ' కొంగు బంగారం (సమ్మక్క, సారలమ్మ) ' గ్రంథాన్ని పంచాయత్ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు సీతక్క నేడు ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు
గిరిజన కుంభమేళా “సమ్మక్క సారలమ్మ జాతర” చరిత్ర ప్రాశస్త్యం, ఆదివాసీ గిరిజన సంప్రదాయాలపైన పరిశోధనాదృష్టితో ఆచార్య సూర్యా ధనంజయ్ రాసిన ' కొంగు బంగారం (సమ్మక్క, సారలమ్మ) ' గ్రంథాన్ని పంచాయత్ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు సీతక్క నేడు ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర ప్రాశస్త్యం, ఆదివాసీ గిరిజన సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతో “ కొంగు బంగారం (సమ్మక్క, సారలమ్మ )” అనే పేరున గ్రంథాన్ని రచించిన ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య సూర్యాధనంజయ్ ను అభినందించారు. ప్రకృతి ఆరాధకులైన ఆదివాసీల సంస్కృతికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన సమ్మక్క, సారలమ్మల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువనీ, వారి చరిత్రను, సంప్రదాయాలను రచించినట్లయితే ఆదివాసీల చరిత్రను, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసినట్లేనని మంత్రి తెలియజేశారు. ఇలాంటి రచనలు మరెన్నో రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ ఉత్సవంగా గుర్తించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ ఉత్సవంగా గుర్తింపుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలియజేశారు. హైకోర్టు అడ్వకేటు, పూర్వ వాణిజ్యపన్నుల అసిస్టెంట్ కమీషనర్ డా. ధనంజయ్ నాయక్, నిజాం కళాశాల సహాయాచార్యుడు డా. రాజారాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.