ఆధునిక సాంకేతిక మాయాజాలంలో మనిషి తప్పిపోయాడు అంటూ ఈ. వెంకటేష్ రాసిన కవిత ' మనిషి కథ ' ఇక్కడ చదవండి :
అనగనగా
ఒక మనిషి...
మానవత్వం ధరించి
విలువలను అలంకారాలుగా
ఆవాహన చేసుకుని
సాటి మనిషి పట్ల
దయాసముద్రుడై
తొలి పొద్దు సూర్యునిలా
కరుణోదయ కటాక్షాలను
విరివిగా వెదజల్లే వాడు
అప్పటి మనీషి
స్వార్థ రహితుడై
బాటసారులకు తియ్యటి తేనెను
ఉచితంగా పంచేవాడు
undefined
క్రమేపి కాలం మారింది
కాలసర్పంలా మనిషిని కాటేసింది
స్వార్థం ఒళ్లంతా పాకి
డబ్బు పిచ్చి వైరస్ లా వ్యాపించి
మనుషులను వెన్నెముక లేని
తల నిటారుగా నిలుపలేని
జంతువులా మార్చింది
ఆధునిక సాంకేతిక మాయాజాలంలో
మనిషి తప్పిపోయాడు
తన చిరునామాను మరిచిపోయాడు
మూలాలను మూలకు నెట్టి
స్మార్ట్ ఫోన్లలో
తన ముఖాన్ని సిగ్గుతో దాచుకుంటున్నాడు
సాటి మనిషితో మాట్లాడడం
కడుపారా కరచాలనం చేయడం
గత కాలపు పురాతన వైభవ చిహ్నం
అభివృద్ధి అంటే మనిషితనాన్ని తాకట్టు పెట్టి
అధోగతికి దిగజారడం అనుకుంటున్నాడు
ఈ విశ్వమంతా
కాసిన్ని విశ్వాస మానవత్వపు
విత్తనాలు చల్లడం అని తెలుసుకోలేకున్నాడు.
కవులు, రచయితలకు ఏసియా నెట్ సాహితీ వేదిక స్వాగతం