ఈ. వెంకటేష్ కవిత : మా బిచ్చవ్వ

By narsimha lodeFirst Published Jan 10, 2024, 10:01 AM IST
Highlights

మా యవ్వ చీర కొంగు మడిసి కలుపు తీస్తే భూమంతా చెమట సువాసనలతో మత్తెక్కి మూర్చపోయేది అంటూ ఈ. వెంకటేష్ రాసిన కవిత ' మా బిచ్చవ్వ ' ఇక్కడ చదవండి : 


గ్రామంలో
సూర్యుడు నలుపు రంగు
పులుముకుని మేల్కొంటాడు
దళితులకు జరుగుతున్న
అన్యాయాలను చూడలేక

గాలి మలయ మారుతంలా
మెల్లగా తాకుతూ వెళ్లదు
తుఫానుల పెనుగాలులు వీస్తాయి
గడీలు ,మేడలు
నిజాం వారసుల గర్వాన్ని
సత్యనాశ్ చేస్తాయి

మాది ఊరంటే ఊరు కాదు
చైతన్యమే రక్ష మాంసాలుగా
జవసత్వాలు కలిగిన పుణ్యభూమి

మా యవ్వ తన అనుభవంతో
చెప్పే జీవిత సత్యాలముందు
నాలుగు వేదాలు నాలుక
గీసుకోవడానికి కూడా పనికిరావు

ఉత్పత్తి కులంలో జన్మించి
వ్యవసాయంలో గిట్టుబాటు కాక
దళారీల మధ్య ఒంటరి ఖైదీలా
ఇప్పటికీ మోసపోతూనే ఉన్నాం...

పనిచేయడం, చెమటోడ్చడం తప్ప 
ఇతర వేషాలు వేయలేని వాళ్ళం
ఎప్పుడైనా నేను పని తప్పితే
మా బిచ్ఛవ్వ
పిచ్చలకు ఉరివేస్తా జాగ్రత్త  
అని తియ్యగా తిట్టేది

మా యవ్వ చీర కొంగు మడిసి కలుపు తీస్తే
భూమంతా చెమట సువాసనలతో
మత్తెక్కి మూర్చపోయేది

మగవాళ్ళని సైతం
వ్యవసాయ పనిలో
ముందుకు వెళ్లనిచ్చేది కాదు
ఎవడైనా కారు కూతలు కూస్తే
దవడలు ఇరగకొట్టేది

పిడకలు ఏరుకు రారా అని
నన్ను బాగా సతాయించేది
నేను ఎంతకు వెళ్లక పోతే
నీ పెళ్ళాం పెద్దమనిషిగాను
అంటూ నవ్వుకుంటూ ఎక్కిరించేది

మా బిచ్చవ్వను చూస్తుంటే
చాకలి ఐలమ్మ, సావిత్రి భాయి ఫూలే లే 
నాకు స్పష్టంగా  కనిపించేది
 

click me!