డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : ఆ గది

Published : Oct 31, 2023, 02:00 PM IST
డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : ఆ గది

సారాంశం

విగతజీవై వివరించిన జ్ఞానబోధి -  కన్నుల రెటీనా విజ్ఞానవని ఆ గది అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత  ' ఆ గది ' ఇక్కడ చదవండి :

నాకొక తరగతి గది
అదే నా శరీర నిర్మాణ శాస్త్ర వేదం 
విప్పిచూపి 
నాలోని నన్ను నాకు కణకణం
చదువై నేర్పిన కొత్తపాఠశాల ఆ గది

సైగలతో పిలిచి పలకరించు 
సుందర దరహాసాల అందాల మోముపై
సంక్లిష్ట అద్భుత నయనాల నిర్మతిని
విగతజీవై వివరించిన జ్ఞానబోధి 
అంతర్ముఖమైన కెమెరా చిత్రాలలో 
బింబప్రతిబింబమై జీవించే 
కన్నుల రెటీనా విజ్ఞానవని ఆ గది

నాలో నిదురించక నిదురించే
ప్రియ నేస్తమే 
గుండె గొంతుకైన నిత్య స్పందన తీరంలో 
ప్రసరించే దేహగేహాల రుధిర జీవ కావ్యం
నాలుగు గదుల రక్త ప్రవాహ గీతం 
ప్రతి ఉదయం రాత్రి, 
నిరంతం సాగే వెలుగు పూల గోప్యం విప్పిన 
అవయవ నిర్మాణ విజ్ఞానశాల  ఆ గది

ఊపిరిలో ఊపిరై జీవించే
జీవన శ్వాసకోశ వీణియ తీగలు 
ప్రాణమైన జీవ క్రియలో
బతుకున ఊయలూగే ఊపిరి
ప్రాణాధార వాయు ద్వారాలై 

ఇలాగే
అన్ని క్రియలతో బతికే మనిషి
అపూర్వ నిర్మాణ కాంతి దేహంలో
తన రక్తమాంసముల మమతల కణాల 
నేర్పు నెనరుగ నేర్చిన  వేళ్ళు
నాలో ఎదిగిన చిగుళ్ళ ఆనవాలు
ఆ గది

సజీవ దేహాల సర్జరీకి అందివచ్చిన 
అమూల్య మెట్లమేడ నాకు
ఆ గది
క్లిష్టమైన విలువైన వైద్యశాస్త్ర బోధనా గది
అదే..అదే...ఎనాటమీ హాల్

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం