బిట్ల అంజనీ దేవి రచించిన తొలి కవితా సంపుటి 'మనసెందుకో సున్నితం' ఆవిష్కరణ కార్యక్రమ వివరాలు ఇక్కడ చదవండి
ఓరుగల్లు నుండి మరొక కవయిత్రి తన రచనలద్వార స్త్రీ అస్తిత్వ ప్రకటనతో రావడం ఆనందంగా ఉందని విమర్శకురాలు కాత్యాయని విద్మహే అన్నారు. ఈరోజు ఉదయం గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్ సెమినార్ హాల్ , హన్మకొండలో కవయిత్రి, ఉపాధ్యాయురాలు బిట్ల అంజనీ దేవి రచించిన తొలి కవితా సంపుటి 'మనసెందుకో సున్నితం' ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీలేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు శ్రీరంగస్వామి అధ్యక్షత వహించారు. సంపుటిని ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు కాత్యాని విద్మహే ఆవిష్కరించి మట్లాడారు. అంజనీ కవిత్వంలో వివిధ సామాజిక అంశాలపై పలు కవితలున్నాయని వీటన్నీటిని పరిశీలిస్తే తన భావజాలం అర్థమవుతుందన్నారు.
పుస్తకాన్ని జి.కళావతి సమీక్షిస్తూ అన్ని రంగాలలో వలెనే మహిళలు సాహిత్య రంగంలోనూ వివక్షకు గురయ్యారని, ఎంతో మంది మహిళలు తమ గొంతుకలో కొట్లాడే భావాలను, సృజనాత్మకతను కాగితం మీదికి తేలేకపోయారని అన్నారు. కవిత్వం కాలక్షేప వ్యవహారం కాదని ఒక దృక్పథంతో రచనలు చేయడం అనేది తగిన అవగాహన, ఆచరణల నుండే సాధ్యమవుతుందని అంజనీ దేవి 'మనసెందుకో సున్నితం' కవితా సంకలనం వస్తువు రీత్యా ప్రశస్తమైనదని కొనియాడారు.
కార్యక్రమంలో కవులు లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావు, కొమర్రాజు రామలక్ష్మి, బిల్ల మహేందర్, ఉప్పలయ్య, అస్నాల శ్రీనివాసు మాట్లాడారు. సభలో పి.చంద్, డా. బండారు సుజాత, వకులవాసు, గట్టురాధిక, అనిత, మాదారపు వాణిశ్రీ, లింగారెడ్డి, తాటిపాముల రమేష్, ప్రదీప్, సుదర్శన్, శ్రీమన్నారాయణ, అడప రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.