వినాయక చవితి సందర్భంగా గణేశుడిని స్తుతిస్తూ కర్నాటి లింగయ్య ఓ కవిత రాశారు. వినాయక చవిత నవరాత్రుల సందర్భంగా ఈ కవితను అందిస్తున్నాం.
ముల్లోకముల పుణ్యనదుల
స్నానమాడి ముందు ఎవరు
నా వద్దకు చేరితే,
వారికే ఆధిపత్య మన్న పరమేశ్వరుడు!!
కుమారస్వామి వాయువేగము ప్రారంభించి,
వినాయకుడు నారాయణ మంత్రము చే
కైలాసమున తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి,
విఘ్నాధిపత్యాన్ని పొందిన గణనాథుడు!!
భాద్రపద శుద్ధ చవితినాడు
విఘ్నాధిపత్యం పొందిన నీవు,
ఏ కార్యమైనా ప్రారంభించుటకు
తొలి పూజ నీకే గణనాధ!!
భక్త సులభుడవూ నీవు
గరికపోచలంటే ప్రీతి నీకు.
ఇరవై ఒక్క పత్రాలతో పూజ నీకు.
ప్రయోజనాలు మాకు గణనాధ!!
విజ్ఞ నాయక చరణం.
సర్వలోక నాయక శరణం.
శుభముల నిచ్చే తరుణం.
విశ్వమంతా ఆనందం.
పార్వతి దేవి తనయుడవయ్యా.
దర్శనమిచ్చుటకు రావయ్యా.
అందరమూ ఆడిపాడే దమయ్యా.
వేదనలన్నీ తీర్చుదువయ్యా..!!
నవరాత్రులలో నీ పండుగ చేయగ,
నీ దీవెనలు మాకు అండగ ఉండగ,
ఉండ్రాల పాయసం నీ కయ్య,
వేలం పాడిన లడ్డు మాకయ్య!!
మట్టి ప్రతిమ మంచిదంటారు.
ప్రతిమను మట్టితో నీటితో చేస్తారు.
మనిషికి దేవుని అనుబంధం,
నిమజ్జనానికి ఇది నిదర్శనం!!
గణపతి బప్పా నీకు శుభ మంగళం.
ఆదిదేవుని తనయా నీకు జయ మంగళం.
సిద్ధి బుద్ధి కి మహోన్నత మంగళం.
నీ దీవెనలే మాకు కైవల్యం!!
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature